Monica Bedi : ఏపీ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ మాజీ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇటీవలే అరెస్టయ్యారు. ఆయనకు సంబంధించిన మరో సంచలన వ్యవహారం తాజాగా బయటపడింది. సినీనటి మోనికా బేడీ.. అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూసలెంకు ప్రియురాలు అని అందరికీ తెలుసు. మోనికా బేడీకి నకిలీ పేరుతో పాస్‌పోర్టు జారీ అయిన వ్యవహారం రెండున్నర దశాబ్దాల క్రితం కలకలం రేపింది. సనా మాలిక్ కమల్ పేరిట మోనికా బేడీకి 2001 ఏప్రిల్ 9న నివాస ధ్రువీకరణపత్రాన్ని జారీ చేసింది ఎవరో కాదు పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డే. అయితే అప్పట్లో ఆయన కర్నూలు తహసీల్దార్‌గా ఉన్నారు.
Also Read :IAS Transfers : ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు..?
కర్నూలులో మోనిక నివసిస్తున్నట్లుగా..
కర్నూలులోని బాబూ గౌండ వీధిలో మోనికా బేడీ నివసిస్తున్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్‌ను కృష్ణమోహన్‌రెడ్డి(Monica Bedi) మంజూరు చేశారు. ఆ టైంలో కర్నూలు జిల్లా ఎస్పీ మరెవరో కాదు పీఎస్‌ఆర్ ఆంజనేయులు. సనా మాలిక్ కమల్ (మోనికా బేడీ)కు కృష్ణమోహన్‌రెడ్డి నివాస ధ్రువీకరణపత్రం జారీ చేసిన తర్వాత.. లోకల్ పోలీస్ ఎంక్వైరీ జరిగింది. అందులోనూ అసలు విషయాన్ని గుర్తించలేకపోయారు. మోనికా బేడీకి సనా మాలిక్ కమల్ పేరిట పాస్‌పోర్టు జారీకి నిరభ్యంతర పత్రాన్ని జిల్లా పోలీసు శాఖ జారీ చేసింది. పీఎస్‌ఆర్ ఆంజనేయులు తర్వాత కర్నూలు ఎస్పీగా వచ్చిన ఎన్.సంజయ్ హయాంలో 2002 ఆగస్టులో ఈ నకిలీ పాస్‌పోర్టు వ్యవహారం వెలుగుచూసింది. ఆనాటి తహసీల్దార్ కృష్ణమోహన్‌రెడ్డి జారీ చేసిన నివాస ధ్రువపత్రం, అప్పటి ఎస్పీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు జారీ చేసిన నిరభ్యంతర పత్రం ఆధారంగానే సనా మాలిక్ కమల్ పేరుతో నకిలీ పాస్‌పోర్టును మోనికా బేడీ పొందింది.
Also Read :Indira Soura Giri Jala Vikasam : ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగాలు
మోనిక, అబూసలెం దొరికాక విషయం వెలుగులోకి
దీనిపై అప్పట్లో తొలుత కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సీబీఐ విచారణ మొదలైంది. నాడు తహసీల్దార్ హోదాలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డిని పోలీసులు, సీబీఐ అధికారులు విచారించారు. అయితే స్థానిక ఆర్‌ఐ మహ్మద్ యూనిస్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను మోనికా బేడీకి నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేశానని కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. తద్వారా ఆ కేసులో ఆయన సాక్షిగా మారారు. కృష్ణమోహన్‌రెడ్డి తాజాగా అరెస్టైన నేపథ్యంలో 2001, 2002లో జరిగిన మోనికాబేడీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో మాఫియా డాన్ అబూసలెం, మోనికా బేడీతో పాటు అప్పటి కర్నూలు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ యూనిస్, ఏఎస్సై సత్తార్ సహా మరికొందర్ని కోర్టు దోషులుగా తేల్చింది. వారందరికీ శిక్షలు విధించింది. అబూ సలెం 1993 నాటి ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక పాత్రధారి. మోనికా బేడీ తన ప్రియుడు అబూ సలెంతో కలిసి 2002లో పోర్చుగల్‌కు పారిపోయింది. వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మోనికా బేడీ పాస్‌పోర్టును తనిఖీ చేయగా .. కర్నూలుతో ఉన్న లింకులు బయటపడ్డాయి.