YS Jagan: తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని మాజీ సీఎం జగన్ (YS Jagan) తెలిపారు. సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని, ఆయన మోసాన్ని గుర్తించిందన్నారు. అందుకే తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ చంద్రబాబుకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. కోట్ల మంది హిందువుల మనోభావాల విషయంలో చంద్రబాబు అబద్ధాలు ఆడారాని పేర్కొన్నారు. పాలన ఫెయిల్ కావడంతోనే లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారని జగన్ ఆరోపించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు భయం, భక్తి కలిగిన వ్యక్తి ఎవరైనా సరే దేవుడికి క్షమాపణ చెబుతాడని, కానీ చంద్రబాబుకు పశ్చాత్తాపంలేదని విమర్శించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబు అబద్ధాలు మానలేదన్నారు. పరిపాలనలో సీఎం చంద్రబాబు ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా తిరుమల లడ్డూపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారని తెలిపారు. కల్తీ నెయ్యి ఉన్న ట్యాంకర్‌లను వెనక్కి పంపామని టీటీడీ ఈవో చెబితే.. హామీల అమలు విషయంలో సమాధానం లేక.. కల్తీనెయ్యి వాడామని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు.
Also Read: Khamenei: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏకం కావాలి: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ
సనాతన ధర్మం అంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలుసా అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ‘‘సనాతన ధర్మం తెలిసిన వ్యక్తివే అయితే చంద్రబాబు.. వేంకటేశ్వరస్వామి లడ్డూను అపహాస్యం చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నావు. అబద్ధం అని నీకు తెలిసినా ఎందుకు వ్యతిరేకించడంలేదు. ఆ అబద్ధంలో నువ్వు కూడా ఒక భాగంగా ఉన్నావు. ఇదేనా నీ సనాతన ధర్మం’’ అని పేర్కొన్నారు.
లడ్డూ వివాదంపై సిట్ అవసరం లేదు: జగన్
తిరుమల లడ్డూ వివాదం సీఎం చంద్రబాబు సృష్టించిన అబద్ధం అని తేలిపోయిందని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ వివాదంపై ఎలాంటి సిట్ దర్యాప్తు కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు కూడా దీనిని విశ్వసించిందని, అందుకే చంద్రబాబు వేసిన సిట్‌ను రద్దు చేసిందన్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామితో ఎవరైనా ఆడుకుంటే.. ఆ నష్టం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు.