YCP: విశాఖలో వైసీపీ ఉత్తరాంధ్ర సమీక్ష.. ఆ అంశంపై కీల‌క చర్చ‌!

రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని నాయకులు తీర్మానించారు. గ్రామస్థాయి నుండి పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ, పార్టీ క్యాడర్‌ను చైతన్యపరచడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు.

Published By: HashtagU Telugu Desk
APs Development

APs Development

YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తమ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురంలో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.

ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీలోని ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ధర్మాన ప్రసాదరావు, మజ్జి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Mandaadi Accident: మందాడి షూటింగ్‌లో పడవ బోల్తా – కోటి రూపాయల నష్టం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కీలక చర్చ

సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్) విధానంలో ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయంపై సుదీర్ఘంగా చర్చించారు. పేదలకు వైద్య విద్యను, వైద్య సేవలను దూరం చేసే ఈ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే కార్యాచరణను రూపొందించారు.

జగన్ ఆందోళనకు ఏర్పాట్లు

ఈ నెల 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమం ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ఈ ఆందోళనను విజయవంతం చేసి, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బలంగా తెలియజేయాలని నాయకులు నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి, పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కోఆర్డినేటర్ కన్నబాబు దిశానిర్దేశం చేశారు.

పార్టీ బలోపేతంపై దృష్టి

రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని నాయకులు తీర్మానించారు. గ్రామస్థాయి నుండి పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ, పార్టీ క్యాడర్‌ను చైతన్యపరచడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. రానున్న పోరాటాలకు సన్నద్ధం కావాలని ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులకు నాయకులు పిలుపునిచ్చారు.

  Last Updated: 05 Oct 2025, 02:21 PM IST