Site icon HashtagU Telugu

AP Election Campaign : ఏపీలో అసలు సిసలైన రాజకీయం మొదలుకాబోతుంది..

Pawan Babu Jagan Campgin

Pawan Babu Jagan Campgin

ఏపీలో అసలు సిసలైన రాజకీయ వేడి రేపటి (మార్చి 27) నుండి మొదలుకాబోతుంది. ఏపీలో ఎన్నికల సమరానికి సరిగ్గా 50 రోజులు మాత్రమే ఉండడం తో ఇక ఓటర్లను దర్శించుకునేందుకు రాజకీయ పార్టీల అధినేతలు పయనం కాబోతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్..సిద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం అంటూ రేపటి నుండి ప్రజల్లోకి వెళ్తున్నారు. సీఎం జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్‌ బస్సుయాత్ర చేప‌ట్ట‌నున్నారు. రేపు దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్రను సీఎం జ‌గ‌న్ ప్రారంభిస్తారు. ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు, అక్కడ వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రార్ధనల అనంతరం నివాళి అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరు బయలుదేరుతారు (వయా వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల). సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడినుంచి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డకు (వయా దువ్వూరు, చాగలమర్రి) కు చేరుకుని రాత్రికి బస చేస్తారు.

మొత్తం 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్‌ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్‌ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్‌ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్నారు. సభలు, రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచే ఈ యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు నియోకజవర్గాల్లో ప్రజాగళం పేరుతో నిర్వహించనున్న యాత్రలో భాగంగా మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 27న చంద్రబాబు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, శింగనమలై, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తారు.

మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ నెల 30 న పిఠాపురం నుండి తన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం లోనే పర్యటించనున్నారు. అక్కడే ప్రచారం చేసిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. తొలి రోజు శ్రీ పురూహూతిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రచారంలో భాగంగా మండలాల వారీగా కీలక నేతలతో సమావేశం అవుతారు. ఇలా మూడు పార్టీల అధినేతలు ప్రజల్లోకి వెళుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతుండగా, వైసీపీ మరోసారి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది చూడాలంటే జూన్ 04 వరకు ఆగాల్సిందే.

Read Also : Disha Pathani : మెరుపు తీగలా కుర్రకారుకి మతి పోగొడుతున్న దిశా పటాని