Botsa Satyanarayana : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శారీరక అస్వస్థతకు గురైన సంఘటన క్షణికంగా గందరగోళంలోకి నెట్టింది. పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4, బుధవారం నాడు విశాఖపట్నం జిల్లా ఆంజనేయపురం వద్ద నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ అనే నిరసన కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు గుప్పించేందుకు ఏర్పాటు చేయబడింది. అయితే, కార్యక్రమం మధ్యలోనే ఆయన ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బొత్స సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. ఆంజనేయపురం నుంచి మూడురోడ్ల కూడలి వరకూ కొనసాగిన ఈ ర్యాలీలో ఆయనతో పాటు అనేకమంది పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బొత్స తీవ్రంగా అలసటకు లోనైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ర్యాలీ ముగిసిన అనంతరం, మైకులో మాట్లాడుతుండగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. మాటల మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న వారిని కలవరపరిచింది.
సమీపంలోని పార్టీ కార్యకర్తలు వెంటనే స్పందించి ఆయనను సురక్షితంగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా వైద్యులు ఆయనకు వడదెబ్బ (హీట్ స్ట్రోక్) వచ్చినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయాలని వారు సూచించారు. ఈ సంఘటనపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీకి అనుభవజ్ఞులైన నాయకుల్లో ఒకరైన బొత్సకు ఇలా ఆరోగ్య సమస్య తలెత్తడంపై పలువురు క్షేమ సమాచారం తీలుసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా బొత్స ఆరోగ్యంపై ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజా కార్యక్రమాల్లో ఎండ వేడి ప్రభావాన్ని తప్పక పరిగణలోకి తీసుకోవాలని, రాజకీయ నేతలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని బొత్స ఘటన మరల తెలియజేస్తోంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది.