YCP MLC అనంతబాబు అరెస్ట్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు, తన బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ నిమిత్తం శుక్రవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. విచారణ ముగించుకుని

Published By: HashtagU Telugu Desk
Ananthababu Arrest

Ananthababu Arrest

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు, తన బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ నిమిత్తం శుక్రవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. విచారణ ముగించుకుని తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి కోర్టు వెలుపలికి రాగానే, అప్పటికే అక్కడ మాటువేసిన పోలీసులు ఆయనను చుట్టుముట్టారు. అక్కడికక్కడే ఆయనను అదుపులోకి తీసుకుని నేరుగా కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అనూహ్య అరెస్ట్‌తో కోర్టు ప్రాంగణం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

బెయిల్ రద్దు గండం

గతంలో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అనంతబాబు నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఈ కేసులో సాక్షులను భయపెట్టడమే కాకుండా, వారికి భారీగా డబ్బు ఎరవేసి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినట్లు సిట్ (SIT) అధికారులు గుర్తించారు. సాక్షుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే సర్పవరం పోలీసులు ఆయనపై అదనంగా కేసు నమోదు చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు. సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడమే ఆయన అరెస్ట్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

సుబ్రహ్మణ్యం హత్య కేసు

సుమారు నాలుగేళ్ల క్రితం తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసి, ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అనంతబాబుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా ఏ2 నిందితురాలిగా ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజా అరెస్ట్‌తో అనంతబాబుకు కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అటు దళిత సంఘాలు కూడా ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

  Last Updated: 24 Apr 2026, 03:32 PM IST