YCP: 2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 11 స్థానాల్లో వైసీపీ (YCP) గెలుపొంది ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతోంది. అయితే వైసీపీలో ఉన్న కొందరు నాయకులు రాజకీయ భవిష్యత్తు కోసం కూటమి పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు. కూటమిలో పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనల్లో చేరేందుకు వైసీపీ తాజా, మాజీ నాయకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడే ఇదే విషయమై కూటమిలో చిచ్చు రేగినట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నాయకులను ఇష్టానుసారం తిట్టిన నేతలను ఇప్పుడు బీజేపీ, జనసేన పార్టీలు చేర్చుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నాయకుల చేరికలు వద్దని టీడీపీ బాస్‌కు కార్యకర్తలు, నేతలు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ మాజీ నాయకులకు టీడీపీ ద్వారాలు మూసుకుపోవడంతో వారు బీజేపీ, జనసేన పార్టీలను ఆశ్రయిస్తున్నారు.
Also Read: Projects: అభివృద్ధి పథంలో భారత్.. ఈ ప్రాజెక్టులే నిదర్శనం!
ఇలా వైసీపీ నాయకులు ఆయా పార్టీల కండువాలు కప్పుకోవడంతో కూటమి పార్టీల నడుమ వైసీపీ వలస నేతలు కుంపట్లు రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ, జనసేనల్లో చేరికలను టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ముందు తమను ఇబ్బంది పెట్టినవారిని ఎలా చేర్చుకుంటారని జనసేన, బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి వలసలను వద్దని టీడీపీ నేతలు చెబుతున్నా.. మిగిలిన రెండు పార్టీలు మాత్రం వారి మాటలను పెడచెవిన పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే జనసేన మాత్రం స్థానికత ఆధారంగానే పార్టీలో జాయిన్ చేసుకుంటున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే పార్టీలోకి వైసీపీ మాజీ నాయకులు వస్తున్నారని తెలుస్తోంది. జనసేనను ఇప్పటినుంచే బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల నాటికి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఈ మేరకు పవన్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలో వైసీపీ మాజీ నాయకులు బాలినేని, ఉదయభాను, రోశయ్య చేరిన విషయం తెలిసిందే.
జనంలోకి జగన్..?
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంక్రాంతి నుంచి జనంలోకి రానున్నట్లు తెలుస్తోంది. వారానికోక జిల్లాలో వైసీపీ బాస్ పర్యటన ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా స్థానిక వైసీపీ కార్యకర్తలతో చర్చించి గతంలో చేసిన సమస్యలకు కూడా పరిష్కారం కనుగొంటామన్నారు మాజీ మంత్రి. అయితే జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై భారీ విమర్శలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.