YSRCP : అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో 2024 ఎన్నికల సమయంలో జరిగిన బాణసంచా ప్రమాదం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి కంటిచూపు కోల్పోవడంతో, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల ప్రకారం, లక్కిరెడ్డిపల్లి మండలం అగ్రహారంలో వైసీపీ శ్రేణులు భారీగా బాణసంచా కాల్చారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ లోకేశ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఒక కన్ను కోల్పోయాడు. దీంతో బాధితుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించగా, కమిషన్ సూచనల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం 19 మందిపై లక్కిరెడ్డిపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, గడికోట రమేశ్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇందులో భాగంగా, ఈరోజు ఉదయం ఎంపీపీ సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులపైనా త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో శ్రద్ధా లోపం వల్ల జరిగిన ఈ ప్రమాదం, వైసీపీ నేతలపై న్యాయపరమైన చిక్కులకు దారి తీసింది.
Jagga Reddy : చివరకు పెళ్లాంమొగుళ్ల మాటలు కూడా రికార్డు చేశారు కొడుకులు