YS Jagan Vs BJP : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఢిల్లీలో బుధవారం చేసిన ధర్నా ఏపీ రాజకీయాల్లో కొత్త టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వయంగా వచ్చి వైఎస్ జగన్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. శివసేన (ఉద్ధవ్) పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ కూడా వచ్చి జగన్‌ను కలిసి ధర్నాకు మద్దతు ప్రకటించారు. జగన్ ఇండియా కూటమి వైపు వెళ్లబోతున్నారు అనేందుకు ఇదొక స్పష్టమైన సంకేతం అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలో టీడీపీతో చేతులు కలిపి తనను ఓడించిన బీజేపీ కంటే.. తనకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్‌కు చేరువగా ఉండటమే సేఫ్ అనే భావనలో జగన్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్ అన్నీ ఆలోచించుకునే ఇండియా కూటమి నేతల్ని ధర్నాకు మద్దతుగా ఉండాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ లెక్కన రానున్న రోజుల్లో పార్లమెంటు ఉభయ సభల్లో వివిధ బిల్లులపై ఓటింగ్ సందర్భంగానూ వైఎస్సార్ సీపీ స్వతంత్రంగా వైఖరిని తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద బీజేపీని(BJP) ఇప్పుడు వైఎస్ జగన్ కాదనుకుంటే.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఓ వైపు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం నుంచి.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఆయనకు వేధింపులు మొదలయ్యే ముప్పు లేకపోలేదు. వివిధ పెండింగ్ కేసులపై దర్యాప్తును మళ్లీ యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తన నిరసనలకు నైతిక మద్దతు తెలిపేందుకు ముందుకు వస్తున్న ఇండియా కూటమి పార్టీలను కాదనుకొని.. వాటిని ఏమాత్రం పట్టించుకోని ఎన్డీయే కూటమి వైపు జగన్ అడుగులు వేసే అవకాశాలు లేవని అంటున్నారు.
Also Read :IBPS Clerks : 6వేల ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు
2014 సంవత్సరం నుంచి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి జగన్ పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ ఇకపై అలా ఉండదనే సిగ్నల్స్‌ను ఢిల్లీ ధర్నా ద్వారా రాజకీయ వర్గాల్లోకి జగన్ పంపారు. జాతీయ రాజకీయాల్లోని ఏదో ఒక కూటమికి ప్రత్యక్షంగా మద్దతు తెలపడం వల్లే ప్రయోజనం ఉంటుందనే క్లారిటీకి జగన్ వచ్చారు. ఎన్డీయే కూటమికి స్పష్టమైన మద్దతు ఇవ్వడం వల్లే టీడీపీకి ఏపీలో ఎన్నికల ఫలితం కలిసొచ్చింది. వైఎస్సార్ సీపీ కూడా అదేవిధమైన స్పష్టమైన వైఖరిని తీసుకోవడం బెటర్ అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. వచ్చే నాలుగున్నర ఏళ్ల పాటు ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వంపై జగన్ పోరాడే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోదరి వైఎస్ షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్‌కు కూడా చేరువయ్యే అవకాశాలు లేకపోలేదు.