Wild Cows Attack: పంటలపై ఏనుగులు, అడవి పందులు దాడి చేసిన ఘటనల గురించి మనం విన్నాం. ఇప్పుడు ఈ లిస్టులో అడవి ఆవులు కూడా చేరిపోయాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఉన్న కృష్ణాతీర లంక భూముల్లోని పొలాలపై దాడికి దిగుతున్నాయి. వాటిని తోలేందుకు ప్రయత్నించే రైతులపై దాడికి దిగుతున్నాయి. ఇంతకీ ఎందుకీ సమస్య తలెత్తింది ? అడవి ఆవులు ఎక్కడివి ?
Also Read :Central Intelligence: ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులపై ‘‘నిఘా’’.. ఎందుకు ?
అడవి ఆవులు ఎక్కడివి ?
ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అడవి ఆవులు(Wild Cows Attack) ఎక్కడివి ? అంటే.. వీటిని 50 ఏళ్ల క్రితం కృష్ణా నది అడవి లంక భూముల్లో స్థానికులే వదిలారు. ఏళ్లు గడిచిన కొద్దీ వీటి సంతతి పెరిగింది. వీటి సంఖ్య వేల స్థాయికి చేరింది. లంక భూముల అడవుల్లో ఇవి జీవించసాగాయి. అయితే లంక భూముల్లో అడవి ఆవులకు మేత సరిపోవడం లేదు. అందుకే అవన్నీ గుంపులుగా వచ్చి సమీపంలోని పంట పొలాలపై పడుతున్నాయి. ఒక్కో గుంపులో దాదాపు 200కుపైనే ఆవులు ఉంటాయి. అవన్నీ కలిసి పంటలను నాశనం చేస్తున్నాయి. అడవి ఆవులు పెద్దసంఖ్యలో ఉండటంతో రైతులు వాటిని అడ్డుకోలేకపోతున్నారు.ఒకవేళ తరిమే యత్నం చేస్తే.. పొడిచేందుకు పైకి దూసుకొస్తున్నాయి.
Also Read :Sourav Ganguly: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. ఉపాధ్యాయులకు సౌరబ్ గంగూలీ విజ్ఞప్తి
నందిగామ ఎమ్మెల్యే సౌమ్య చొరవతో..
అడవి ఆవుల వల్ల జరుగుతున్న పంటనష్టాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని చందర్లపాడు ప్రాంత రైతులు నందిగామ ఎమ్మెల్యే సౌమ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈవిషయాన్ని ఆమె ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్వయంగా వెళ్లి ఆవుల మందలను డ్రోన్‌తో వీడియోలు తీయించారు. వాటి నుంచి పంటలను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నారు.
పొలాలపై అడవి ఆవుల దాడి.. ఎందుకు ?
పుట్టినప్పటి నుంచి మనుషులకు దూరంగా ఉండటం వల్ల.. అడవి ఆవులకు ఇలాంటి దూకుడు స్వభావం వస్తుంది. కొన్నేళ్ల కిందటి వరకు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట మండల పరిధిలోని తీర గ్రామాల లంకభూముల్లో ఏడాదంతా పచ్చగడ్డి ఉండేది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో పులిచింతల దిగువ నుంచి ప్రకాశం బ్యారేజి ఎగువ వరకు ఒకప్పుడు వందలు, వేల ఎకరాల్లో లంక భూములు ఉండేవి. అయితే గత నాలుగేళ్లుగా ఆ భూముల్లో ఆవులకు మేత కరువైంది. దీంతో ఆకలికి తట్టుకోలేక అడవి ఆవులు సుబాబుల్, జామాయిల్ చెట్ల బెరడునూ తింటున్నాయి. చివరకు మేత కోసం సమీపంలోని పొలాల్లోకి వస్తున్నాయి. పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి.
అడవి ఆవులను ఏం చేయబోతున్నారంటే..
అటవీశాఖ సహకారంతో ఆవులను పట్టి, తెచ్చి గోశాలకు తరలించాలని అధికారులు యోచిస్తున్నారు. అడవి ఆవుల కోసం గోశాలను ఏర్పాటు చేసేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. గంగిరెద్దులను ఆడించే కుటుంబాల వారితో వాటికి శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. తద్వారా అడవి ఆవులను పెంపుడు ఆవుల్లా మచ్చిక చేస్తారు. తర్వాత వాటిని రైతులకు అప్పగిస్తారు. అడవి ఆవుల్లో అరుదైన ఒంగోలు జాతి ఆబోతులు, ఆవులు, దూడలు ఉన్నాయి. ఒక్కో ఆబోతు ధర రూ.10లక్షలకుపైనే ఉంటుందట.