Site icon HashtagU Telugu

President Elections : రాష్ట్రపతి ఎన్నికపై చంద్రబాబు మౌనం వెనుక.. రాజకీయ వ్యూహం!

CBN Social Media

Chandrababu Pegasus

చంద్రబాబు నాయుడు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన యోధుడు. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో సైలెంట్ అయిపోయారు. అటు అధికార పక్షం రాష్ట్రపతి అభ్యర్థి గురించి కానీ .. ఇటు ప్రతిపక్ష రాష్ట్రపతి అభ్యర్థి గురించి కానీ చంద్రబాబు మాట్లాడటం లేదు. ఎందుకీ మౌనం ? ఈ మౌనం కూడా వ్యూహాత్మకమైనదేనా ? అనే సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు చంద్రబాబు తన పార్టీ వైఖరిని ప్రకటించలేదు. “ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును.. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ప్రతిపాదిస్తే టీడీపీ మద్దతు ఇచ్చేది” అని వైఎస్సార్ సీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఏపీ రాజకీయాలను చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేసే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో మోదీ మాత్రం చంద్రబాబును పట్టించుకోవడం లేదని, అదే సమయంలో ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదనేది టాక్. దీంతో చంద్రబాబుకు కోపం వచ్చిందని, అదును చూసి తన రాజకీయ నీతిని చూపించాలని వేచి చూస్తున్నారట. ఈక్రమంలోనే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతును ప్రకటించే విషయంలో టీడీపీ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం విషయంలో అన్ని ఆప్షన్‌లు తమ వద్దనే ఉంచుకునేందుకే టీడీపీ ఈవిధంగా న్యూట్రల్ స్టాండ్ ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రెసిడెంట్ ఎలాక్టోరల్ కాలేజీలో టీడీపీకి ఉన్న ఓట్ల శాతం 0.60 శాతం మాత్రమే.ఇది స్వల్ప నంబరే అయినా ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన టీడీపీ మద్దతును తీసుకోవడం రాష్ట్రపతి అభ్యర్థులకు ఎంతో ముఖ్యమే.