ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 2.22 లక్షల మంది విజయవంతంగా నమోదు అయ్యారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బస్తిపాటి నాగరాజు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పీఎం విశ్వకర్మ పథకం అమలు, నిర్వహణ, ఇతర వివరాలపై ఈ ఇద్దరు ఎంపీలు ప్రశ్నించారు.
పీఎం విశ్వకర్మ పథకం – లక్ష్యాలు, అమలు
2023 సెప్టెంబర్ 17న ప్రారంభించబడిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం, చేతిపనులు చేసే సంప్రదాయ వృత్తుల కళాకారులు, చేతివృత్తుల వారు ఆర్థికంగా స్వయం సమృద్ధులు కావాలనే లక్ష్యంతో రూపొందించబడింది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో, రాష్ట్రాలు లేదా జిల్లాల వారీగా నిధులు కేటాయించబడవు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం కింద ఇప్పటివరకు 21.63 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2.22 లక్షల మంది విజయవంతంగా నమోదు అయ్యారు.
Also Read: Bengaluru Stampede: కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు.. ఆర్‌సీబీపై నిషేధం?!
శిక్షణ కార్యక్రమాలు
బ్లాక్‌స్మిత్‌లు (లొహార్), గోల్డ్‌స్మిత్‌లు (సునార్), మేసన్‌లు (రాజ్ మిస్త్రీ) వంటి వృత్తులపై ప్రత్యేక లక్ష్యాలను ఏ శిక్షణ సంస్థకూ కేటాయించలేదు. అయితే, ఈ పథకంలో నమోదు అయిన ప్రతి లబ్ధిదారుడికి ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనేక శిక్షణ కేంద్రాలు వేలాది మందికి ప్రాథమిక నైపుణ్య శిక్షణను అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. శ్రీ టెక్నాలజీస్, ఎడుజాబ్స్ అకాడమీ, సింక్రోసర్వ్ గ్లోబల్ వంటి సంస్థలు ఈ శిక్షణ కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఎన్‌టిఆర్ జిల్లాలో కూడా ప్రత్యేక శిక్షణ కేంద్రాల ద్వారా వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. విజయవాడ, మైలవరం, నందిగామ, జి. కొండూరు వంటి ప్రాంతాల్లోని శిక్షణ కేంద్రాల్లో బంగారు కార్మికులు, కొలిమి కార్మికులు (blacksmiths), తాపీ మేస్త్రీలకు (masons) శిక్షణ అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 78 మంది బంగారు కార్మికులు, 16 మంది కొలిమి కార్మికులు, 19 మంది తాపీ మేస్త్రీలు శిక్షణ పొందారు. ఈ పథకం ద్వారా సంప్రదాయ కళల పరిరక్షణతో పాటు, ఆ వృత్తులకు ఆధునిక శిక్షణ, సాధనాలు, ఆర్థిక మద్దతుతో పాటు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కేంద్ర సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే స్పష్టం చేశారు.