Site icon HashtagU Telugu

Nara Brahmani : ‘నారా బ్రాహ్మణి’ లో అనుకూల అంశాలు ఏమిటి?

What Are The Positive Aspects Of Nara Brahmani

What Are The Positive Aspects Of Nara Brahmani

By: డా. ప్రసాదమూర్తి

Nara Brahmani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త పొద్దుపొడుపులా ప్రభవింబోతున్న యువ రాజకీయ నవచైతన్యం నారా బ్రాహ్మణి. చంద్రబాబు అరెస్టు, కోర్టు విచారణ, వాయిదాలు.. కొనసాగుతున్న నేపథ్యంలో, లోకేష్ ఢిల్లీ యాత్ర ముగించుకొని రాష్ట్రానికి రాగానే ఆయనను కూడా ఏవేవో కేసుల్లో ఇరికించి మెయిన్ స్టీమ్ పాలిటిక్స్ నుంచి తెరమరుగయ్యేలా చేయాలని అధికార పార్టీ అష్టవిధ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో, నారా బ్రాహ్మణి (Nara Brahmani) నినాదం తెలుగుదేశం శ్రేణుల్లో నవోత్తేజం నింపుతోంది. రాజకీయం ఒక చదరంగం. నువ్వు ఒక ఎత్తు వేస్తే ప్రత్యర్థి పది ఎత్తులు వేస్తాడు. ఎప్పుడు ఎవరిని ఎవరు ఎలా దిగ్బంధం చేస్తారో ఊహించడం కష్టం. ఏపీ రాజకీయాల్లో తనకు ఎదురు లేకుండా ప్రతిపక్షాన్ని మటుమాయం చేసి పరిపాలన పగ్గాలను పదికాలాలు తమ గుప్పిట పెట్టుకోవాలని చూస్తున్న వైఎస్ జగన్, ఆయన అనుచరగణం ఇప్పుడు కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆ ప్రమాదమే నారా బ్రాహ్మణి (Nara Brahmani).

వ్యక్తుల్ని తెర మరుగు చేస్తే సత్యాలను, రాజకీయాలను, ప్రజాభిప్రాయాలను, తారుమారు చేయవచ్చనుకుంటే అది జగన్ అండ్ కో వారికి ఒక పెద్ద భ్రమగానే మిగిలిపోతుందని తెలుగుదేశం వర్గాల నుంచి చైతన్యవంతమైన సంకేతాలు వస్తున్నాయి. ఆ సంకేతాల సారమే నారా బ్రాహ్మణి. చంద్రబాబు లేకపోతే ఇక తెలుగుదేశం పార్టీ లేదని, లోకేష్ కూడా అరెస్టు అయితే ఇక తెలుగుదేశం పార్టీ తిరిగి కోలుకోలేదని జగన్ వర్గీయులు భావిస్తున్నారు. విశ్లేషకులు కూడా ఇలాంటి అంచనాలే వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో కనుమరుగై, ప్రధాన ప్రతిపక్ష శక్తిగా పవన్ కళ్యాణ్ ఆవిర్భవించవచ్చు అన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి పేరు తుఫానులా ముందుకు దూసుకు రావడానికి రంగం సిద్ధం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.

ఎన్టీఆర్ నిజమైన వారసురాలు..

నారా బ్రాహ్మణి (Nara Brahmani) ఎన్నో విధాలుగా అనుకూలమైన అంశాలతో పార్టీకి కొత్త వెలుగులా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేవలం చంద్రబాబు నాయుడు నీడలోనే కాదు, ఆయన ఎక్కడున్నా ఆయన సూచనలతో ఆశీస్సులతో పార్టీని ముందుకు నడిపే యువ నాయకత్వం ఉందని తేల్చి చెప్పడానికి నారా బ్రాహ్మణి రంగంలోకి రాబోతున్నారు. ఇప్పటివరకు చంద్రబాబును ప్రత్యర్థి వర్గాలు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకుడిగా విమర్శలు గుప్పించాయి. ఆయన కుమారుడైన లోకేష్ కు చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ వారసులమని చెప్పుకునే హక్కు లేదని విమర్శలు కూడా చేశారు. నారా బ్రాహ్మణి విషయంలో అలా ఇక ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఆమె నందమూరి తారకరామారావు మనవరాలు. బాలకృష్ణ కూతురు. ఆ విధంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అసలైన వారసురాలుగా నారా బ్రాహ్మణి ముందుకు వస్తే ఇక విమర్శలు చేయడానికి శత్రుపక్షానికి మరో అవకాశం ఉండదు. అంతేగాక నారా బ్రాహ్మణి యువనాయకత్వానికి పార్టీలో నవచైతన్యానికి ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తారు.

చదువులో, విజ్ఞానంలో, మాటతీరులో, ప్రతిభలో, ఉపన్యాస ధోరణిలో నందమూరి వారసత్వాన్ని నారా బ్రాహ్మణి (Nara Brahmani) కొనసాగిస్తారని ఆమె ఇప్పటికే నిరూపించుకున్నారు. చంద్రబాబు కోడలిగా, లోకేష్ భార్యగా, తారక రాముని మనవరాలుగా ఎటు చూసినా నారా బ్రాహ్మణికి సానుకూలమైన అంశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆమె త్వరలో బస్సు యాత్ర ప్రారంభించి సుడిగాలిలా ఆంధ్రప్రదేశ్ ని చుట్టుముట్టే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అలనాడు నందమూరి తారక రామారావు చైతన్య రథం అధిరోహించి ఎలాంటి చైతన్యాన్ని సృష్టించారో, అలాంటి సంచలనానికి నారా బ్రాహ్మణి శ్రీకారం చుట్టుబోతుందన్న వార్త తెలుగుదేశం నాయకుల్లో, కింద స్థాయి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తానికి జగన్ వర్గం ఒకటి తలిస్తే మరొకటి జరిగేలా కనిపిస్తోంది. ఏ విధంగా చూసినా జగన్ కి రాజకీయ ప్రమాదం తప్పేటట్టుగా లేదు. నారా బ్రాహ్మణి రాక ఆ ప్రమాదానికి పెనుసంకేతం కాబోతోందని రాజకీయ వర్గాలు నమ్ముతున్నాయి.

Also Read:  TDP : లోకేశ్ ను అడ్డుకుంటే జగన్ రెడ్డికి ప్రజలు ఘోరీ కడతారు : మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు