Tirumala Weather: వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని 42-44 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ (Tirumala Weather) నిపుణుల అంచనాలు తలకిందులు అయ్యాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని తడవద్ద తీరం దాటుతుందని అధికార వాతావరణ నిపుణులు హెచ్చరికలతో ఇటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులు అలెర్ట్ అయ్యారు. పునరావస్తు కేంద్రాలు, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు.
అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే వర్షాలు లేకపోవడంతో యధావిధిగా వారిని పంపించడానికి.. మెట్ల మార్గాన్ని తెరవడానికి టీటీడీ అధికారులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద వాతావరణ నిపుణులు అంచనాలు.. తాజా వాయుగుండం అంచనాలు తలకిందులయ్యాయి. తీరం దాటిన తర్వాత కూడ ఎక్కడా వర్షాలు కురవలేదు. భారీ వర్షం నేపథ్యంలో గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు బుధవారం తెలిపిన విషయం తెలసిందే. అయితే వర్షం లేకపోవడంతో శ్రీవారి మెట్టు నడక మార్గం గుండా భక్తులు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Delhi Capitals: గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్ షాక్.. డీసీ డైరెక్టర్‌గా కొత్త వ్యక్తి?
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నటి రాశి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వారికి తీర్థ ప్రసాదాలను టీటీడీ ఉన్నతాధికారులు అందజేశారు.
పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు
వాయుగుండం కారణంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో గురువారం పలు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో గురువారం స్కూళ్లకు సెలవుగా ప్రకటించారు.