CM Chandrababu: ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

ఆటో డ్రైవర్ల కోసం ఏకంగా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని, వారి జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) 2024 ఎన్నికలను రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడని అపూర్వమైన ఎన్నికలుగా అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘సూపర్ సిక్స్’ ద్వారా అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం ఏపీ అని ఆయన ఉద్ఘాటించారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. “సెల్‌ఫోన్లు చూసుకోండి, డబ్బులు వచ్చాయా?” అని అడగ్గా ఆటో డ్రైవర్ల నుంచి “అవును రూ.15 వేలు వచ్చాయి” అనే సమాధానం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్ సహా కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు.

అవినీతి రహిత పాలనతో వ్యవస్థల పునరుద్ధరణ

సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో తమ ప్రభుత్వం అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జమ చేస్తున్నట్లు ప్రకటించారు. గత వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అప్పటికి రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అగమ్యగోచరంగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం తాము ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో రోడ్లు మెరుగుపడ్డాయని తెలిపారు.

Also Read: Job Calendar : 20 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

సీఎం మరింతగా మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటామని, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అందరినీ ఆదుకుంటామని, రూ.25 లక్షల వరకు హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని, దీని ద్వారా 750 సేవలు నేరుగా అందిస్తున్నామని నొక్కిచెప్పారు.

గ్రీన్ ట్యాక్స్ సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జగన్ హయాంలో ఆటోడ్రైవర్లకు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులను ఏడాదిలోపే తమ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం ఏకంగా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని, వారి జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో సహకారం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

  Last Updated: 04 Oct 2025, 02:39 PM IST