Pawan Kalyan : అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ డుంబ్రిగుడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనుల కోరిక మేరకు గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు. కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోంటూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని అన్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటకశాఖ సంయుక్త కార్యాచరణతో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి రూ.5లక్షలు ప్రకటించారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని చెప్పారు. మరోసారి వాలంటీర్ల సమస్యను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి.. సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని మాటిచ్చారు.
ప్రతీ ఒక్కరు ఇంట్లో తులసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గంజాయిని విడనాడాలని అన్నారు. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించే అరకు పర్యాటక అభివృద్ధి కోసం సీఏం చంద్రబాబు , మంత్రి దుర్గేష్‌లతో మాట్లాడతానని అన్నారు. 15 ఏళ్ళ పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలన్నారు. మూడు నెలలు క్రితం చెప్పానని.. ఈరోజు కల సాకారమైందని అన్నారు. డోలీ మోత తప్పాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇక్కడ పర్యాటకం అభివృద్ధి అవ్వాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో మొత్తం 90 కిలోమీటర్లు రోడ్లు వేస్తే.. కూటమి 8 నెలల్లో 1069 కిలోమీటర్లు రోడ్లు వేశామని.. ఇది కూటమి ప్రభుత్వానికి వైసీపీకి మధ్య ఉన్న తేడా అని చెప్పుకొచ్చారు. గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని వెల్లడించారు. ఇక, ఈ పర్యటన అనంతరం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు.