Nara Lokesh : నెల్లూరు జిల్లా కేంద్రంలో వెలసిన వీఆర్ హైస్కూల్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. రాష్ట్రానికి ఎంతో మంది ప్రముఖులను అందించిన ఈ పాఠశాలకు తగిన గుర్తింపు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ హైస్కూల్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినట్టు గుర్తుచేశారు. అలాగే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇక్కడే విద్యనభ్యసించిన విషయాన్ని తెలిపారు. గతంలో మూతబడిన ఈ పాఠశాల పునరుద్ధరణకు ప్రధాన కర్తగా మంత్రి నారాయణ కృషి చేసి ప్రారంభించారని లోకేశ్ ప్రశంసించారు. తిరిగి తెరచిన వీఆర్ హైస్కూల్‌ను ఇప్పుడు మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు.
Read Also: Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కూకట్‌పల్లికి స్పెషల్ క్రేజ్ ..గజం ఎంతంటే !!
నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో వీఆర్ మోడల్ హైస్కూల్‌ను మంత్రిగా నారా లోకేశ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కాంపౌండ్‌ను పరిశీలించారు. తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, సాంకేతిక పాఠన విధానాలు, లైబ్రరీలోని పుస్తకాలను పరిశీలించారు. ప్రతి తరగతి గదిలోని విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యను ఎంచుకోవడం కంటే మంచి పని మరొకటి లేదని, ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివితే ఏమైనా సాధ్యమేనన్నారు. విద్యార్థులు సవాళ్లను స్వీకరించే తత్వాన్ని అలవరుచుకోవాలని, దాన్ని అనుభవంతో నేర్చుకోవాలన్నారు. వ్యక్తిగతంగా నిడమర్రులోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నట్టు తెలిపారు.
గత ఎన్నికల్లో ఓడిపోయాను. కానీ దాన్ని ఓటమిగా కాకుండా సవాలుగా తీసుకున్నాను. ఐదేళ్లు నిరంతరం కష్టపడి, ప్రజల సమస్యలు వినిపించుకొని, సేవ చేశాను. దాని ఫలితంగా ఈసారి భారీ మెజారిటీతో గెలిచాను. నేడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. చాలా మంది ఈ శాఖ బరువు ఎక్కువని చెప్పారు. కానీ విద్యను పవిత్రమైన బాధ్యతగా తీసుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలన్నదే నా ఆశయం. ఇందుకోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు, డిజిటల్ సదుపాయాలు కల్పిస్తూ, ప్రపంచ స్థాయిలో పోటీపడే విద్యను అందిస్తున్నాం అని లోకేశ్ వివరించారు. ఈ సందర్భంగా “పీ4” కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు శరణి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డిలను మంత్రి ఘనంగా సత్కరించారు. వారి భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ మార్పు అనేది రాజకీయ పంథాలో కాదు, భవిష్యత్తు తరం రూపాంతరంలో ముఖ్య పాత్ర పోషించే మార్గమని మంత్రి స్పష్టం చేశారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధి అదే మార్గంలో అడుగులుగా నిలుస్తుందని అన్నారు.
Read Also: Happy Passia : ఉగ్రవాది హ్యాపీ పాసియాను భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధం