Site icon HashtagU Telugu

Banakacharla Project : బనకచర్లపై తెలుగు రాష్ట్రాలతో చర్చిస్తున్నాం – కేంద్రం

Banakacharla

Banakacharla

పోలవరం-బనకచర్ల నీటిపారుదల ప్రాజెక్టు (Banakacharla Project) విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రాథమిక దశలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి ప్రీఫీజిబిలిటీ రిపోర్టును (PFR) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రీయ జల సంఘానికి (CWC) సమర్పించినట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ ప్రాజెక్టుపై పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ అభిప్రాయాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏ ఇతర రాష్ట్రానికి నీటి వాటా లేదా హక్కుల విషయంలో నష్టం వాటిల్లకుండా, అనుమతులు, అంచనాలు, టెక్నికల్ స్పెసిఫికేషన్లను సక్రమంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Fan : అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన అభిమాని..ఏంట్రా ఇది !!

బనకచర్ల ప్రాజెక్టు ప్రధానంగా పోలవరం ఎడమ కాల్వ ద్వారా రాయలసీమకు నీటిని మళ్లించేందుకు రూపొందించబడినది. దీని ద్వారా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయితే తాగునీటి సమస్యతో పాటు సాగునీటి కొరత కూడా కొంత మేర తీర్చబడనుంది. గతంలో కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో, కేంద్రం అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నది.

ప్రస్తుతం ప్రాజెక్టు టెక్నికల్ మరియు ఆర్థిక అంచనాలపై పని జరుగుతోంది. వీటి అధ్యయనం పూర్తైన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని కేంద్రం వెల్లడించింది. అన్ని పరిపూర్ణ నివేదికలు వచ్చిన తర్వాతే అనుమతుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం ముందుంటే, ఇటు తెలంగాణ అభ్యంతరాలను కూడా సమర్థంగా పరిష్కరించే దిశగా కేంద్రం వ్యవహరించాల్సిన అవసరం ఉంది.