Jockey Andhra Pradesh : రాయ‌ల‌సీమ‌లో `జాకీ` జ‌గ‌డం

రాయ‌ల‌సీమ రాజ‌కీయం `జాకీ` ప‌రిశ్ర‌మ వైపు తిరిగింది. ఆ ప‌రిశ్ర‌మ ఎందుకు రాష్ట్రాన్ని వీడింద‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

  • Written By:
  • Updated On - November 22, 2022 / 04:44 PM IST

రాయ‌ల‌సీమ రాజ‌కీయం `జాకీ` ప‌రిశ్ర‌మ వైపు తిరిగింది. ఆ ప‌రిశ్ర‌మ ఎందుకు రాష్ట్రాన్ని వీడింద‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని చూసి భ‌య‌ప‌డి వెళ్లిపోయింద‌ని టీడీపీ, ఆనాడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వాటాల‌ను అడ‌గ‌డం కార‌ణంగా ఆ ప‌రిశ్ర‌మ వెళ్లిపోయింద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ రెండు పార్టీలు చెబుతోన్న దాట్లో నిజం ఏదో తెలియ‌దుగానీ `జాకీ` మాత్రం ఏపీకి దూరంగా ఉంటోంది.

ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా విశాఖ కేంద్రంగా పారిశ్రామిక సద‌స్సులు జ‌రిగాయి. సుమారు రూ. 25ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ఒప్పందాలు జ‌రిగాయ‌ని ఆనాడు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. కొన్ని కంపెనీల‌కు భూముల‌ను కూడా కేటాయించారు. ఆ జాబితాలో `జాకీ` కూడా ఉంది. కానీ ‘జాకీ’ పరిశ్రమ ఏపీ నుంచి తరలి వెళ్లింది. దీనిపై టీడీపీ నేతలు విమర్శించ‌డాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. టీడీపీ ప్రభుత్వ కమీషన్ల బేరం వల‌న ఆనాడే జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని ఆరోపించారు. పరిశ్రమల మంత్రిగా ఉన్న నారా లోకేష్ అనంత‌పురం జిల్లాకు చెందిన‌ పరిటాల సునీత కూడా మంత్రివర్గంలోనే ఉన్నారని గుర్తు చేశారు. జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్లిపోయిందో వాళ్లిద్దరినే అడగాలని తోపుదుర్తి ఎదురుదాడికి దిగారు.

Also Read:  Somu Veerraju : పాపం వీర్రాజు

“జాకీ పరిశ్రమ నిమిత్తం పేజ్ అనే సంస్థకు నాటి ప్రభుత్వం 2017లో భూములు కేటాయించింది. ఆ మరుసటి ఏడాది సేల్ డీడ్ ఇచ్చింది. అయినప్పటికీ పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ఆనాడు రూ.240 కోట్ల విలువైన భూముల‌ను చౌక‌గా ఎలా రాసిచ్చారు?” అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ధ్వజమెత్తారు. ‘జాకీ’ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించాలని ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం కోరుతూనే ఉంది. పరిశ్రమ ఏర్పాటుకు భూములు ఇస్తామని చెబుతున్నా ‘జాకీ’ వర్గాలే ముందుకు రావడంలేదు. దీనికి కార‌ణం ఏమిటో ఎవ‌రికీ అంత‌బ‌ట్ట‌డంలేదు.

రాష్ట్రం విడిచిపోతోన్న కంపెనీలు భూముల క‌బ్జాల గురించి లేఖ‌లు రాస్తున్నాయ‌ని ఏపీ బీజేపీ చీఫ్ వీర్రాజు అంటున్నారు. అందుకే, భూముల కేటాయింపుపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. `జాకీ` పరిశ్రమ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డి వెళ్లింద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఎప్ప‌టి నుంచో టీడీపీ కూడా చెబుతోంది. దీంతో అధికార‌, విప‌క్షాల మధ్య `జాకీ` రాజ‌కీయ అంశంగా మారింది.

Also Read:  YS Jagan Meeting : జ‌గన్ స‌భ `ఒక్క ఫోటో`వందరెట్ల అభ‌ద్ర‌త‌!