వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అంతర్గత రాజకీయం ఇప్పుడు తాడేపల్లిలోని అధినేత జగన్ క్యాంప్ ఆఫీస్ చుట్టూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. గత కొంతకాలంగా జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను తన గుప్పిట్లో పెట్టుకున్న కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. జైలు నుండి విడుదలైనప్పటి నుండి చెవిరెడ్డి తాడేపల్లిలోనే మకాం వేసి, జగన్‌కు అత్యంత సన్నిహితంగా పనులు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో, పార్టీ వ్యూహాలు మరియు ఆధిపత్యం విషయంలో ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయని, తాడేపల్లి వర్గాల్లో అంతర్గత యుద్ధం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ‘అరెస్టుల సెంటిమెంట్’ అనే సరికొత్త అస్త్రాన్ని జగన్ ముందు ఉంచుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని, ఇది జగన్ ఇమేజ్ గ్రాఫ్‌ను పెంచుతుందని ఆయన ప్రత్యేక సర్వే రిపోర్టులతో జగన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌లో కసి పెరగాలంటే మరిన్ని అరెస్టులు జరిగేలా వ్యూహాలు రచించాలని, ఇది రాజకీయంగా లాభిస్తుందని చెవిరెడ్డి నమ్ముతున్నారు. జగన్‌ను ఖుషీ చేసే ఈ సెంటిమెంట్ రాజకీయాలకు చెవిరెడ్డి కొత్త వ్యూహకర్తగా ఎదుగుతుండటం సజ్జలకు మింగుడుపడటం లేదు.
అయితే, తన మాటే నెగ్గాలనుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం చెవిరెడ్డి వ్యూహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉందని, మరిన్ని అరెస్టులు జరిగితే ద్వితీయ శ్రేణి నాయకత్వం పూర్తిగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరిస్తున్నారు. అరెస్టుల వల్ల ఇమేజ్ రావడం పక్కన పెడితే.. పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సజ్జల వాదన. కానీ, జగన్ మాత్రం సజ్జల కంటే చెవిరెడ్డి రిపోర్టులకే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తాడేపల్లిలో సజ్జల మాటే వేదంగా ఉండేది, కానీ ఇప్పుడు సీన్ మారింది. సజ్జల అనుభవం గొప్పదా లేక చెవిరెడ్డి అరెస్టుల సెంటిమెంట్ వ్యూహం గొప్పదా అనే నిర్ణయం జగన్ చేతిలోనే ఉంది. ఈ ఇద్దరి వైరం పార్టీ కేడర్‌ను అయోమయంలోకి నెట్టే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
