Terror Plans Case : విజయనగరం యువకుడు సిరాజ్, సికింద్రాబాద్ యువకుడు సమీర్‌లు కలిసి బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై దర్యాప్తునకు నేరుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. విజయనగరానికి చేరుకున్న ఎన్‌ఐఏ దర్యాప్తు బృందాలు నిందితులను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నాయి. వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నాయి. సిరాజ్, సమీర్‌లను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని ఎన్ఐఏ కోరింది. ఇక సిరాజ్ వ్యవహారంపై ఏఎస్సైగా పనిచేస్తున్న తండ్రితో పాటు ఎస్‌పీఎఫ్‌లో పనిచేస్తున్న సోదరుడికి ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read :Toyota Kirloskar Motor : ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’ ప్రకటించిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
ముంబై, ఢిల్లీలకు సిరాజ్.. ఎందుకు ?
గ్రూప్ 2 కోచింగ్ కోసం విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వెెళ్లిన సిరాజ్ దారి తప్పాడు. అతడికి వివిధ సోషల్ మీడియా యాప్‌లలో ఉగ్రవాద భావజాలం కలిగిన వారు పరిచయమయ్యారు. ఈ జాబితాలో సికింద్రాబాద్‌కు చెందిన సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు(Terror Plans Case) కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయా వ్యక్తులను కలిసేందుకు ముంబై, ఢిల్లీలకు సిరాజ్ వెళ్లినట్లు సమాచారం. సిరాజ్ 2024 నవంబరు 22న ముంబైకి వెళ్లి 10 మందిని కలిశాడు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో పలువురిని అతడు కలిశాడు. తాను కలిసిన వారందరితో టచ్‌లో ఉండటానికి సిగ్నల్ యాప్‌లో ఒక గ్రూపును సిరాజ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. సిగ్నల్ యాప్‌లో ఛాట్ చేసుకుంటూ దాడులకు బాంబు పేలుళ్లకు సిరాజ్, సమీర్ వ్యూహరచన చేశారు. సిగ్నల్ యాప్‌లోని సదరు గ్రూప్‌లో ఉన్న ఇతర సభ్యులను కూడా గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు.
Also Read :Diabetes Symptoms: తరచూ మూత్ర విసర్జన మాత్రమే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా షుగర్ ఉందని సూచిస్తాయి!
సిరాజ్, సమీర్‌ల ఛాట్‌లలో ఏముంది ?
సిరాజ్, సమీర్‌లకు చెందిన సోషల్ మీడియా ఛాట్‌లను పోలీసులు నిశితంగా పరిశీలించారు. దీన్నిబట్టి ఒక విషయం అర్థమైంది. సిరాజ్, సమీర్ సహా ఈ యువకులంతా తమ మత వర్గానికి అన్యాయం జరుగుతోందని భావించారు. ఈ అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయారు. వారిలో రేగిన ఈ కోపాన్నే సౌదీ అరేబియాలో ఉంటున్న బిహార్‌కు చెందిన అబూ మూసబ్ ఉగ్రవాదంగా మార్చాడు. సిరాజ్, సమీర్‌లు అబూ మూసబ్‌తో సోషల్ మీడియాలో ఛాట్ చేసేవారు. అతడి సూచనల మేరకు బాంబు పేలుళ్లకు అవసరమైన రసాయనాల కోసం సిరాజ్ ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చాడని గుర్తించారు. జనం రద్దీ భారీగా ఉండే ప్రదేశాల్లో ఈ బాంబులను పేల్చాలని సిరాజ్, సమీర్, అబూ మూసబ్ స్కెచ్ గీశారు. అబూ మూసబ్ ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్టు గుర్తించారు.