Terror Plans Case : విజయనగరం ఉగ్రవాద లింకుల కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాద భావజాలం కలిగిన విజయనగరం వాసి సిరాజుర్ రెహ్మాన్ బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.42 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అతడి బ్యాంకు ఖాతాలో నగదు జమ తప్ప, విత్‌డ్రా చేసిన దాఖలాలు లేవని వెల్లడైంది. ఇంతకీ అన్ని డబ్బులు ఎక్కడివి ? ఎవరు ఇచ్చారు ? అనే దానిపై ప్రస్తుతం ఏపీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు కూపీ లాగుతున్నారు. సిరాజ్ సెల్‌ఫోన్‌ను పరిశీలించి, అతడి ఆర్థిక లావాదేవీల వివరాలను తెలుసుకుంటున్నారు. సిరాజ్‌కు 11 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, వాటిలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని అంటున్నారు. ఏడాది క్రితం వరకు సిరాజ్ కుటుంబం కొత్తవలసలో ఉండేది. ఆ తర్వాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయింది. దీంతో కొత్తవలసలోని డీసీసీబీ శాఖలో ఉన్న బ్యాంకు ఖాతాను సిరాజ్ విజయనగరానికి మార్చుకున్నాడని గుర్తించారు. విజయనగరంలోని డీసీసీబీలో సిరాజ్ పేరిట పొదుపు (ఎస్‌బీ), డిపాజిట్(ఎఫ్‌డీ) ఖాతాలు ఉన్నాయి. సిరాజ్ తండ్రి పేరిట లాకర్ ఉంది.
Also Read :Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు
సిరాజ్ తండ్రి ఏం చేశారంటే..
సిరాజ్ తండ్రి సోమవారం రోజు సాధారణ దుస్తుల్లో విజయనగరం డీసీసీబీకి వెళ్లారు. ఆ బ్యాంకులోని తన లాకర్‌ను తెరవాలని బ్యాంకు అధికారులను కోరారు. అయితే అందుకు వాళ్లు నో చెప్పారు. మంగళవారం రోజు సిరాజ్ తండ్రి ఖాకీ దుస్తుల్లో బ్యాంకుకు వెెళ్లగా.. లాకర్‌ను తెరిచేది లేదని అధికారులు చెప్పారు. సిరాజ్ అరెస్టయ్యాక, లాకర్‌ను తెరిచేందుకు అతడి తండ్రి యత్నించడానికి గల కారణాన్ని తెలుసుకోవడంపై ఎన్ఐఏ టీమ్ ఫోకస్ పెట్టింది. ఆ లాకర్‌లో ఏముంది అనేది తెలుసుకోనున్నారు. సిరాజ్ సహా అతడి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలని విజయనగరంలోని వివిధ బ్యాంకులను ఎన్ఐఏ దర్యాప్తు అధికారులు కోరారు.
లాకర్లు, ఖాతాల వ్యవహారం ఆ తర్వాతే..
మే 17వ తేదీ రాత్రి నుంచి విశాఖ సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో సిరాజ్ ఉన్నాడు. అతడిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని విజయనగరం జిల్లా కోర్టులో ఎన్ఐఏ పిటిషన్ వేసింది. అయితే ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నందున విశాఖ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేయాలని న్యాయమూర్తి సూచించారు. సిరాజ్‌ను కస్టడీకి ఇచ్చాకే.. బ్యాంకు ఖాతాలు, లాకర్లలో ఉన్న నిధుల వ్యవహారాన్ని తేల్చాలని ఎన్ఐఏ అధికార వర్గాలు భావిస్తున్నాయి.
రెండు సార్లు సౌదీకి వెళ్లిన సిరాజ్
గ్రూప్-2 శిక్షణ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన సిరాజ్, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా రెండు సార్లు సౌదీ అరేబియాకు(Terror Plans Case) వెళ్లినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.నిరుద్యోగిగా ఉన్న సిరాజ్‌కు విదేశాలకు వెళ్లేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు టికెట్లు సమకూర్చారు ? అక్కడ ఎవరిని కలిశాడు ? అనే విషయాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఎన్ఐఏ అధికారులు దృష్టి పెట్టారు. సౌదీలో ఉంటున్న బీహార్ వాస్తవ్యుడు అబూతలయం అలియాస్ అబూ ముసబ్‌ను సిరాజ్ కలిసి ఉండొచ్చని భావిస్తున్నారు. అతడి నుంచే డబ్బులు, ఉగ్ర పేలుళ్లకు ప్లానింగ్ సిరాజ్‌కు అంది ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా సిరాజ్, సమీర్‌లకు అబూ ముసబ్ బ్రెయిన్ వాష్ చేసి ఉండొచ్చని అంటున్నారు.
Also Read :Corona Case: అలర్ట్.. మూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!
ఇలా పట్టుకున్నారు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. దేశవ్యాప్తంగా అనుమానాస్పద ఫోన్ కాల్స్, వ్యక్తుల కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈక్రమంలోనే విజయనగరంలో టూటౌన్ పరిధిలో నివాసముంటున్న సిరాజ్ ఫోన్‌లోని సిగ్నల్ యాప్‌లో ఉన్న రహస్య గ్రూప్‌ను పోలీసుల ఇంటెలీజెన్స్ టీమ్ గుర్తించింది. ఆ గ్రూప్ సభ్యుల సంభాషణలను పరిశీలించింది. ఆ తర్వాత కొద్ధి రోజులకే సదరు సిగ్నల్ గ్రూపుకి అడ్మిన్‌గా ఉన్న సిరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్‌ను విచారించిన తర్వాత హైదరాబాద్‌లో సమీర్‌ను అరెస్టు చేశారు.