YS Bhaskar Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్ రెడ్డిపై నమోదైన సెక్షన్స్ ఇవే.. నేడు సీబీఐ మేజిస్ట్రేట్ ముందుకు..?

వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)పై సీబీఐ (CBI) కీలక ఆరోపణలు చేసింది. వివేకా హత్యకేసులో భాస్కర్ రెడ్డిని కుట్రదారుడిగా పేర్కొంది. ‘‘సాక్ష్యాలు చెరిపేయడంలో కీలక పాత్ర పోషించారు.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 02:32 PM IST

వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)పై సీబీఐ (CBI) కీలక ఆరోపణలు చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్యకేసులో భాస్కర్ రెడ్డిని కుట్రదారుడిగా పేర్కొంది. ‘‘సాక్ష్యాలు చెరిపేయడంలో కీలక పాత్ర పోషించారు. హత్యకు ముందు సునీల్, భాస్కర్ రెడ్డి నివాసంలోనే ఉన్నాడు. కదిరి వెళ్లి దస్తగిరి గొడ్డలి తెచ్చేప్పుడు అక్కడే ఉన్నాడు. గూగుల్ టేకౌట్ ద్వారా దీన్ని గుర్తించాం. వివేకా వల్ల రాజకీయ ఎదుగుదల ఉండదని భాస్కర్ రెడ్డి భావించారు’’ అని పేర్కొంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆయన భార్యకు అధికారులు అరెస్టు మెమోను ఇచ్చారు. అందులో 130 బీ, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వెంటనే అతడి ఫోన్ సీజ్ చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని పులివెందుల నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. హైదరాబాద్ సీబీఐ మేజిస్ట్రేట్ ముందు ఆదివారం సాయంత్రం భాస్కర్ రెడ్డిని హాజరుపర్చనున్నారు

మరోవైపు.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిరసన చేపట్టారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్యాప్తు ఏకపక్షంగా చేసి భాస్కర్ రెడ్డిని కేసులో ఇరికించారని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. పులివెందులలోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయాన్నే చేరుకున్నఅధికారులు గంటపాటు ప్రశ్నించి ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ తొలుత కడపకు తరలించారు.

Also Read: YS Bhaskar Reddy: బిగ్ బ్రేకింగ్.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

2019 మార్చి 14వ తేదీన రాత్రి పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేశారు. ఈ హత్య జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లోచంద్రబాబు ఓడిపోయారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ కేసు విచారణకు చంద్రబాబు నియమించిన సిట్ స్థానంలో మరో సిట్ ను జగన్ ఏర్పాటు చేశారు.