Viveka:తాడేప‌ల్లికి సుప్రీం వేడి!అవినాష్ అరెస్ట్ త‌థ్యం?

మాజీ మంత్రి వివేకానంద్ రెడ్డి(Viveka) హ‌త్య కేసులో  క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) అరెస్ట్ కు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది.

  • Written By:
  • Updated On - April 24, 2023 / 05:07 PM IST

మాజీ మంత్రి వివేకానంద్ రెడ్డి(Viveka) హ‌త్య కేసులో  క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)అరెస్ట్ కు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని సుప్రీం కోర్టు సూచించింది. తెలంగాణ హైకోర్టులో వేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను స‌వాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీం కోర్టులో స‌వాల్ చేశారు. ఆమె పిటిష‌న్ మీద సోమ‌వారం విచార‌ణ చేసిన సుప్రీం కోర్టు ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డానికి అవ‌కాశంలేద‌ని తేల్చేసింది. ఫ‌లితంగా ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయంగా క‌నిపిస్తోంది.

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి  అరెస్ట్ కు సీబీఐ రంగం (Viveka)

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి (Viveka ) హ‌త్య కేసును జూన్ 30వ తేదీ వ‌ర‌కు విచారించ‌డానికి సీబీఐకి అనుమ‌తిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన విచార‌ణను కూలంకుషంగా చేయాల‌ని ఆదేశించింది. వాస్త‌వంగా ఈనెలాఖ‌రు నాటికి కేసు విచార‌ణ పూర్తి చేయాల‌ని గ‌త నెల సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టింది. కానీ, కేసులోని ట్వీస్ట్ ల‌ను దృష్టిలో ఉంచుకుని జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ విచార‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అంతేకాదు, తెలంగాణ హైకోర్టుకు చుర‌క‌లు వేస్తూ సీజేఐ చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. కేసు విచార‌ణ స‌మ‌యంలో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించింది.

జూన్ 30వ తేదీ వ‌ర‌కు విచారించ‌డానికి సీబీఐకి అనుమ‌తిస్తూ

వివేకా హ‌త్య (Viveka) కేసు విచార‌ణ‌పై సుప్రీం కోర్టు సీరియ‌స్ గా స్పందిస్తూ సీబీఐకి మ‌రో డైడ్ లైన్ పెట్టింది. ఇప్ప‌టికే సుప్రీం కోర్టు వేసిన సీబీఐ సిట్ విచార‌ణ వేగ‌వంతం చేసింది. ఆ క్ర‌మంలో అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారించ‌డానికి ప‌లు ప్ర‌య‌త్నాలు చేసింది. తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేయ‌డం ద్వారా అవినాష్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డుతూ వ‌చ్చారు. ఈనెల 25వ తేదీ వ‌ర‌కు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు త‌ప్పుబ‌ట్టింది. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ మీద విచార‌ణ సంద‌ర్భంగా తెలంగాణ హైకోర్టుకు సీబీఐ ఇచ్చిన స‌మాధానాన్ని గుర్తు చేసుకుంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అనివార్యంగా క‌నిపిస్తోంది. ఒక వేళ విచార‌ణ కు వ‌స్తే, అరెస్ట్ చేస్తారా? అంటూ గ‌త వారం తెలంగాణ హైకోర్టు సీబీఐని ప్ర‌శ్నించింది. అవ‌స‌ర‌మైతే, అరెస్ట్ చేస్తామ‌ని ఆ సంద‌ర్భంగా సీబీఐ అధికారులు చెప్పిన విష‌యాన్ని బట్టి అరెస్ట్ త‌ప్ప‌ద‌న్న సంకేతం బ‌లంగా క‌నిపిస్తోంది.

సీబీఐకి మ‌రో డైడ్ లైన్

గ‌త వారం రోజులుగా ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) తండ్రి భాస్క‌ర్ రెడ్డి, ఉద‌య‌కుమార్ రెడ్డి సీబీఐ క‌స్ట‌డీలో ఉన్నారు. గ‌త నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ నిర్విరామంగా విచార‌ణ చేస్తోంది. క‌స్ట‌డీలోని నిందితులు చెబుతోన్న ఆన‌వాళ్ల‌కు అవినాష్ రెడ్డి చెబుతోన్న దానికి పొంత‌న కుద‌ర‌డంలేదు. హ‌త్య జ‌రిగిన రోజు అవినాష్ రెడ్డి క‌ద‌లిక‌ల‌పై ఇప్ప‌టికే ఒక నిర్థార‌ణ‌కు సీబీఐ వ‌చ్చింది. ఆయ‌న ఆఫీస్ లోని కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌, పీఏ ద్వారా పులివెందుల వెళ్లిన సీబీఐ ఆదివారం కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టింది. డిజిట‌ల్ టెక్నాల‌జీ ద్వారా అవినాష్ రెడ్డి క‌ద‌లిక‌ల‌ను సీబీఐ నిర్థారించుకుంది. ఆ దిశ‌గా వేగంగా సీబీఐ క‌దులుతోంది.

Also Read : Viveka Murder : YS క్రైమ్ థ్రిల్ల‌ర్! వివేకా హ‌త్యలో DNA ట్విస్ట్?

సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్ర‌కారం సీబీఐ విచార‌ణ‌కు న్యాయ వ్య‌వ‌స్థ నుంచి స్వేచ్ఛ ల‌భించింది. దీంతో ముంద‌స్తు బెయిల్ ప్ర‌స్తావ‌న ఇక ఉండ‌దు. రాజ‌కీయ‌ప‌ర‌మైన లాబీయింగ్ ఏమీ లేక‌పోతే, నేడోరేపో అవినాష్ రెడ్డి(Avinash Reddy)  అరెస్ట్ త‌థ్యం కానుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తాడేప‌ల్లి కోట‌రీలో వ‌ణుకు మొద‌ల‌యింది. ఇప్ప‌టికే వివేకా హ‌త్య కేసు వైఎస్ కుటుంబాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. హ‌త్య జ‌రిగిన రోజు వైఎస్ భార‌తి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఫోన్లు ఎన్నిసార్లు వెళ్లాయి? అనే కోణం నుంచి సీబీఐ. విచార‌ణ ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే భార‌తి పీఏ న‌వీన్ , జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓఎస్ డీ కృష్ణ మోహ‌న్ రెడ్డిని సీబీఐ విచారించింది. న్యాయ‌ప‌రంగా ఉండే చిక్కుల నుంచి బ‌య‌ట‌ప‌డ్డ సీబీఐ ఇప్పుడు జూలు విదిల్చ‌నుంది. ప్ర‌త్యేక సిట్ లోని ఒక టీమ్ ఢిల్లీలోని సుప్రీం కు కేసు విచార‌ణ అప్ డేట్స్ ను తెలియ‌చేసింది. రెండో టీమ్ భాస్క‌ర్ రెడ్డి, ఉద‌య‌భాస్క‌ర్ రెడ్డి వాగ్మూలాన్ని తీసుకుంది. ఇప్పుడు ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ మిగిలి ఉంది. ఆ త‌రువాత తాడేప‌ల్లి కోట వైపు సీబీఐ మ‌ళ్లే ఛాన్స్ లేక‌పోలేదు.

Also Read : Viveka Murder Case: వ‌ర్మ ‘నిజం’లో వివేకా హ‌త్య‌!