Thummalapalli Kalakshetra: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్పు..

విజయవాడలో (Vijayawada) దశాబ్దాల చరిత్ర కలిగిన తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చేశారు.

విజయవాడలో దశాబ్దాల చరిత్ర కలిగిన తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం (Thummalapalli Kalakshetra) పేరును మార్చేశారు. ఆడిటోరియానికి కేవలం కళాక్షేత్రం అని మాత్రమే పేరును ఉంచడం ప్రస్తుతం వివాదంగా మారింది. సాంస్కృతిక, కళా వైభవానికి కృషి చేసిన మహనీయుల పేర్లను తొలగించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రి ఎదురుగా విశాలమైన స్థలంలో కళాక్షేత్రం నిర్మాణానికి 1953లో శిలాఫలకం వేశారు. నగరానికి చెందిన డాక్టర్‌ తుమ్మలపల్లి శ్రీహరి నారాయణ పంతులు ఈ స్థలాన్ని ఆడిటోరియం నిర్మాణం కోసం నగరపాలక సంస్థకు దానమిచ్చారు. తొలుత తుమ్మలపల్లి వారి మున్సిపల్‌ ఆడిటోరియం పేరుతో నిర్మాణం చేపట్టారు. తర్వాత ప్రముఖ వాగ్గేయకారుడు, మహాకవి క్షేత్రయ్య పేరును జోడించి తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి వేల కళాప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆడిటోరియం వేదికైంది.

గత ప్రభుత్వంలో రూ.8 కోట్లతో ఆధునికీకరణ తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని (Thummalapalli Kalakshetra) తొలిసారి 2003లో రూ.50 లక్షల వ్యయంతో ఆధునికీకరించారు. 2015లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు దీని అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులను విడుదల చేశారు. గత ప్రభుత్వం రూ.8 కోట్లతో కళాక్షేత్రం రూపురేఖల్ని పూర్తిగా మార్చింది. 2016 పుష్కరాలకు ముందు ఆధునికీకరించిన కళాక్షేత్రాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరంభించారు. అత్యాధునిక సౌండ్‌ సిస్టమ్‌, సీటింగ్‌, ఏసీలు, గార్డెనింగ్‌తో కొత్త రూపు తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత రవీంద్రభారతి లేని లోటును ఇక్కడి కళాకారులకు తీర్చాలనే లక్ష్యంతో ఇంత భారీగా మార్పులు చేసినా.. నాటి జ్ఞాపకాలు చెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆడిటోరియం వెలుపల మహనీయుల విగ్రహాలనూ అలాగే ఉంచారు.

ఏడాది కిందటే పేరు మార్పు వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏడాది కిందట ఈ కళాక్షేత్రాన్ని రూ.కోటితో మళ్లీ ఆధునికీకరించారు. భవనం వెలుపలి వైపు రూపురేఖలనూ మార్చారు. ఈ సమయంలోనే తుమ్మలపల్లి పేరును తొలగించి కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంచారు. సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేరునూ మార్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఎన్టీఆర్‌ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరును అడ్డగోలుగా మార్చి విమర్శల పాలైన ప్రభుత్వం.. ఇప్పుడు తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం అత్యంత హేయమైన చర్య అని సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ విమర్శించారు.

Also Read:  Dhanush: ధనుష్ గురించి సంయుక్త మీనన్ మాటల్లో..