TDP : మాజీ మంత్రి వ‌ర్సెస్ ఎంపీ.. చంద్ర‌బాబు ఇంద్ర‌కీలాద్రి ప‌ర్య‌ట‌న‌లో ఆ మాజీ మంత్రికి ఊహించ‌ని షాక్‌

ఏపీలో అన్ని జిల్లాలో టీడీపీ గెల‌వాల‌ని క‌సితో నాయ‌కులు ప‌నిస్తుంటే ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో టీడీపీ నేత‌లు మాత్రం ఆధిప‌త్యం

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 04:25 PM IST

ఏపీలో అన్ని జిల్లాలో టీడీపీ గెల‌వాల‌ని క‌సితో నాయ‌కులు ప‌నిస్తుంటే ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో టీడీపీ నేత‌లు మాత్రం ఆధిప‌త్యం కోసం పాకులాడుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో ఘోరంగా ఓట‌మి పాలైన‌ప్ప‌టికి టీడీపీ నేతల తీరు మార‌లేదు. ఓట‌మి త‌రువాత కూడా జిల్లాలో వ‌ర్గ‌పోరు తీవ్రంగా ఉంది. జిల్లా అంతా త‌న‌దే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించిన దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు వ‌ల్ల టీడీపీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని క్యాడ‌ర్‌లో భావ‌న ఉంది. ఓట‌మి త‌రువాత అయిన నేత‌లు మార‌తార‌ని చూసిన క్యాడ‌ర్‌కి అది నిరాశ‌గానే మిగిలింది. తాజాగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో విభేదాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అంతరం పెరిగిపోయింది.

ఈ విభేదాలు వ్యక్తిగతంగా దూషణలకు దిగే స్థాయికి కూడా వెళ్లిపోయాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇంద్ర‌కీలాద్రి దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చిన సంద‌ర్భంలో మాజీ మంత్రి దేవినేని ఉమాని ఎంపీ కేశినేని నాని ఘోరంగా తిట్లు తిట్టార‌ని క్యాడ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికే స‌మ‌యంలో దేవినేని ఉమా.. త‌న చోటామోటా నాయ‌కుల్ని వేసుకుని హ‌డావిడి చేశారు. ఉమాతో పాటు కేశినేని నాని సోద‌రుడు శివ‌నాథ్‌, బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరాలు చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికేందుకు దుర్గ‌గుడి వ‌ద్ద హ‌డావిడి చేశారు. ద‌ర్శ‌నం కోసం లోప‌లికి వెళ్లేందుకు అంద‌రిని నెట్టుకుంటూ వెళ్లారు. అయితే అదే స‌మ‌యంలో ఎంపీ కేశినేని నాని, మిగిలిన నేత‌లు దుర్గుగుడి స్వాగ‌త మండ‌పం వ‌ద్దే బ‌య‌ట వేచి ఉన్నారు. వెనక్కి తిరిగి ఎంపీ కేశినేని నానిని చంద్ర‌బాబు పిల‌వ‌డంతో ముందుకు వ‌చ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అంత‌రాల‌యం లోప‌ల కూడా దేవినేని ఉమా, చిన్ని, బుద్దా బ్యాచ్ హ‌డావిడితో ఎంపీ కేశినేని నాని బ‌య‌టే నిలిలిపోయారు. దీంతో చంద్ర‌బాబు కేశినేని నానిని పిలవాలంటూ, తన భద్రతా సిబ్బందికి చెప్ప‌గా.. భద్రతా సిబ్బంది సార్‌ పిలుస్తున్నారు లోపలికి రావాలంటూ కేశినేని నానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. లోపల స్థలం లేదులే, ఇక్కడే ఉంటామని కేశినేని నాని వారికి చెప్పినట్లు తెలిసింది. చివరకు దేవినేని ఉమా బయటకు వచ్చి, కేశినేని నాని భుజంపై చెయ్యి వేసి, లోపలికి వెళ్లాలని కోరారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఎంపీ కేశినేని నాని, భుజంపైన వేసిన చెయ్యి విసిరికొట్టి, ‘యూజ్‌లెస్‌ ఫెలో’ మంత్రిగా ఉన్న నాలుగేళ్లు మీకు ఎవ్వరూ కనిపించలేదు, పార్టీని భ్రష్టు పట్టించావని ఊగిపోయారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా సైలెంట్‌గా ఉండిపోయారు.

విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలో దేవినేని ఉమా వ‌ర్గాలు ప్రోత్స‌హించార‌ని భావ‌న క్యాడ‌ర్‌లో ఎక్కువ‌గా ఉంది. గ‌తంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానిల‌ను దేవినేని ఉమా తీవ్రంగా ఇబ్బంది పెట్టార‌ని.. అందుకే వారిద్ద‌రు పార్టీ మారార‌ని క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. 2013లో కేశినేని నాని టీడీపీ లో చేరిన త‌రువాత పార్ల‌మెంట్ ప‌రిధిలో విస్తృతంగా ప‌ర్య‌టించి పార్టీని బ‌లోపేతం చేశారు. 2014, 2019లో వ‌రుస‌గా ఎంపీగా గెలిచారు. అయితే కేశినేని నాని జిల్లాలో ముఖ్య నాయ‌కుడు అవుతాడ‌నే అభ‌ద్ర‌తాభావంలో ఉన్న దేవినేని ఉమామ‌హేశ్వ‌రావు కేశినేని నానిని కూడా ఇబ్బందుల‌కు గురి చేశారు. కేశినేని నాని కుటుంబంలోనే దేవినేని ఉమా విభేదాలు సృష్టించార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Also Read:  Pawan Kalyan – Barrelakka : పవన్ కళ్యాణ్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బర్రెలక్క

నానికి చెక్ పెట్టేందుకు ఆయ‌న సోద‌రుడు చిన్నిని తెర‌మీద‌కు తెచ్చి ఎంపీ టికెట్ చిన్నిదేన‌ని ఉమా ప్ర‌చారం చేయిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం అంతా ఎంపీ కేశినేని నాని గ‌మనిస్తునే అప్పుడ‌ప్పుడు అధిష్టానంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఇలాంటి వ‌ర్గాల‌ను ప్రోత్స‌హిస్తు పార్టీని డ్యామేజ్ చేసుకుంటుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. జిల్లాని ఏలాల‌ని చూసిన దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకి ఈ సారి మైల‌వ‌రం టికెట్ ద‌క్కుతుందో లేదో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉమా సొంత మ‌నుషులు కూడా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా తిరుగుతున్నారు. దేవినేని ర‌మ‌ణ ప్ర‌ధాన అనుచ‌రుడు గ‌న్నే ప్ర‌సాద్ మైల‌వ‌రం టికెట్ రేసులో ఉన్నారు. ఇప్ప‌టికైన దేవినేని ఉమామ‌హేశ్వ‌రావు త‌న కుటిల రాజ‌కీయాలు మాని పార్టీ కోసం ప‌ని చేయాల‌ని క్యాడ‌ర్ కోర‌తున్నారు.