పామర్రు ఎమ్మెల్యే మరియు టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల కుమార్ రాజా (Varla Kumar Raja), వైఎస్ జగన్ ప్రభుత్వం, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ అమరావతి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌడీల తరహాలో మాట్లాడుతున్న పేర్ని నాని రాష్ట్రంలోని విధ్వసం సృష్టించేలా మాట్లాడుతున్నాడు. పేర్ని నాని రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి మాటల దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేర్ని నానిపై ఇటీవల బయటపడ్డ ఫోన్ సంభాషణలపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని వర్ల కుమార్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచే అసహనం, అసౌకర్యం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న “సూపర్ సిక్స్” కార్యక్రమాల వల్లే జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని తెలిపారు. వైసీపీ మలిన రాజకీయాలు ప్రజల్లో తిరస్కారాన్ని కలిగించడంతో ఇప్పుడు పేర్ని నానిని ముందుకు తెచ్చి “డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నాడని విరుచుకుపడ్డారు.
Aiden Markram: ఐసీసీ అరుదైన గౌరవాన్ని అందుకున్న సౌతాఫ్రికా ఆటగాడు!
రేషన్ బియ్యంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిన విషయంలో పేర్ని నాని పాత్రపై విమర్శలు చేస్తూ, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుందనే సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయని వర్ల కుమార్ పేర్కొన్నారు. ఈ భయంతోనే ప్రజలను మభ్యపెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. “రప్ప రప్ప” అంటూ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా విచారణకు తగినవని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి బెదిరింపు ధోరణిని తాము సహించబోమని హెచ్చరించారు.
పామర్రు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలనే చంద్రబాబు ప్రయత్నాలను జగన్, పేర్ని నాని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వీరి కుట్రలు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నాయని, ప్రభుత్వంమీద నమ్మకంతో ప్రజలు నిలబడాలన్నారు. చట్టపరంగా పేర్ని నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.