Milk Mafia : అందరూ చిక్కటి పాలనే కోరుకుంటారు. అలాంటి క్వాలిటీ పాలను సప్లై చేసే వారి కోసం ఎంతోమంది వెతుకుంటారు. కాస్త ధర ఎక్కువైనా నాణ్యమైన పాలనే తాగాలని కోరుకుంటారు. ఇలాంటి వాళ్లకు కొన్ని పాల ముఠాలు కుచ్చుటోపీ పెడుతున్నాయి. పాలను చిక్కగా మార్చేందుకు వాటిలో మాల్టోడెక్స్‌ట్రిన్, పామోలిన్ వంటి కృత్రిమ పదార్థాలను కలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ తరహా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇలాంటి పాలను తాగడం వల్ల జనం ఆరోగ్యం దెబ్బతింటోంది. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇలాంటి మాఫియాలు వెలుగుచూశాయి. ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో ఈ తరహా నకిలీ పాల తయారీ యూనిట్లను పోలీసులు గుర్తించారు. గతంలో హైదరాబాద్‌లోనూ ఇలాంటి దందాలు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.
Also Read :Somnath Temple: సోమనాథ్ ఆలయంలో ప్రధాని పూజలు.. ఈ ఆలయం చరిత్ర తెలుసా ?
ఏమిటీ మాల్టోడెక్స్‌ట్రిన్ ?
- మాల్టోడెక్స్‌ట్రిన్(Milk Mafia) అనేది ఒక రకమైన గ్లూకోజ్.
- పండ్ల రసాలు, బేకరీ ఉత్పత్తుల్లో చిక్కదనం కోసం దీన్ని ఉపయోగిస్తారు.
- మాల్టోడెక్స్‌ట్రిన్‌ను అతికొద్ది పరిమాణంలోనే వాడాలి.
- దీన్ని పాలల్లో కలిపేందుకు అనుమతులు లేవు.
- 25 కిలోల మాల్టోడెక్స్‌ట్రిన్ బ్యాగ్ ధర దాదాపు రూ.1,900 ఉంటుంది.
- మాల్టోడెక్స్‌ట్రిన్‌ను పామోలిన్‌తో కలిపి మిక్సీలో వేసి చిక్కటి పేస్టుగా తయారు చేస్తారు. అనంతరం పాలల్లో కలుపుతారు.
- 10 శాతం వెన్న ఉండే పాలకు డెయిరీలు రూ.80 దాకా ధరను చెల్లిస్తున్నాయి.
- 7 శాతం వెన్న ఉండే పాలకు డెయిరీలు కేవలం రూ.54 ఇస్తాయి.
- మాల్టోడెక్స్‌ట్రిన్ కలిపిన పాలల్లో సాలిడ్స్ ఆఫ్ ఫ్యాట్ బాగా పెరుగుతాయి. దీంతో దానికి ధర ఎక్కువగా వస్తుంది.
- పట్టణాల్లో, నగరాల్లో ఇంటింటికి తిరిగి పాలు పోసే వారిలో కొందరు.. పాలలో చిక్కదనం కోసం మాల్టోడెక్స్‌ట్రిన్ వాడుతున్నారట.
Also Read :Sarojini Naidu : తెలుగు వీర వనిత సరోజినీ నాయుడు.. నిజాం నవాబు మెచ్చిన రచయిత్రి !
ఎలా గుర్తించాలి ?
పాలను వేడి చేశాక, వాటిని మన వేలికి రాసుకుంటే నెమ్మదిగా జారిపోవాలి. చిక్కచిక్కగా ఉంటే మాత్రం అందులో మాల్టోడెక్స్‌ట్రిన్ ఉన్నట్టుగా సందేహించాలి.
ఆరోగ్యానికి ముప్పు
- మాల్టోడెక్స్‌ట్రిన్ కలిపిన పాలను తాగితే పిల్లల్లో జీర్ణ సమస్యలు వస్తాయి.
- చిన్న, పెద్ద పేగుల్లో ఆరోగ్యకర బ్యాక్టీరియా తగ్గిపోతుంది.
- పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతాయి.
- యాంటిబయోటిక్స్ వాడినా పనిచేయవు.
- పాల ద్వారా వచ్చే లాక్టోజ్‌ను విచ్ఛిన్నం చేయాలంటే లాక్టేజ్ ఎంజైమ్ అవసరం. 16 ఏళ్ల వయసు తర్వాత శరీరంలో దీని ఉత్పత్తి ఆగిపోతుంది. మాల్టోడెక్స్‌ట్రిన్ కలిపిన పాలను తాగితే, లాక్టేజ్ ఎంజైమ్ పేగుల్లో పేరుకుపోతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ఆహార కదలికలు స్తంభిస్తాయి.
- షుగర్ ఉన్నవారు ఈ పాలు తాగితే చక్కెర స్థాయి పెరుగుతుంది.
- గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
- తేన్పులు, కడుపులో మంట, అల్సర్ వంటివి వస్తాయి.