Undavalli Arun Kumar : రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగా లేఖ రాశారు. 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్నాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకోవాలని ఉండవల్లి లేఖలో పేర్కొన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ..లేఖలో పలు విషయాలను ఉండవల్లి ప్రస్తావించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పలుమార్లు ప్రస్తావించారని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేదే తన వాదన అని ఉండవల్లి తెలిపారు.
పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు, ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలన్నారు. సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. అలాగే సుప్రీంకోర్టులో ప్రభుత్వాల నుంచి అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు బీజేపీతో కలిసి పనిచేయటం వల్ల రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవటానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవటానికి ఇదే సరైన సమయమని అన్నారు.
కాగా, అప్పట్లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ లో జరిగిన పరిణామాల్ని తప్పుబడుతూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా పలుమార్లు అదే పార్లమెంట్ లో స్పందించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ తలుపులు మూసి పెప్పర్ స్ప్రేలు వాడి విభజన చేసిన తీరును వీరు తప్పుబట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విభజనపై తన పిటిషన్ కు స్పందించాలని కోరుతూ ఉండవల్లి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.
Read Also:Sajjala : తగ్గేదేలే అంటున్న సజ్జల..ఏ విషయంలో అనుకుంటున్నారు ..!!