Site icon HashtagU Telugu

Reddys Lab : రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచి కోట్లు విలువైన మాలిక్యూల్ మాయం

Srikakulam Reddys Lab Type 2 Diabetes Molecule Stolen

Reddys Lab : ఫార్మా ఇండస్ట్రీలో వినియోగించే ప్రతీ రసాయనం, ప్రతీ మాలిక్యూల్ చాలా ఖరీదైనది. అలాంటిది  రూ.కోట్లు విలువ చేసే టైప్-2 డయాబెటిస్ (షుగర్) మాలిక్యూల్ చోరీకి గురైంది. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఈ దొంగతనం  జరిగింది. ఈ యూనిట్‌లోని పౌడర్‌ విభాగం నుంచి టైప్-2 డయాబెటిస్  మాలిక్యూల్‌ పౌడర్‌ను దొంగిలించారు. దీనిపై రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Also Read :Maoists Encounter : మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

రూ.కోట్లు ఖర్చు చేసి.. 

టైప్-2 డయాబెటిస్‌ వ్యాధిపై రెడ్డీస్‌ ల్యాబ్‌(Reddys Lab) సైంటిస్టులు ముమ్మర పరిశోధనలు చేశారు. ఈ వ్యాధి చికిత్స కోసం వారు ‘పెప్‌టైడ్‌’ తరహాలోని  ఒక మాలిక్యూల్‌ను ఆవిష్కరించారు. అది పౌడర్ రూపంలో ఉంటుంది. టైప్‌ 2 మధుమేహాన్ని సమర్థంగా నియంత్రించేలా ఈ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ)ని తయారు చేసినట్లు సమాచారం. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. దానితో డయాబెటిస్ మాత్రలు, ఇంజెక్షన్లను తయారుచేయాలని యోచించారు.

Also Read :Education Department : సంచలనం.. త్వరలోనే ప్రభుత్వ విద్యాశాఖ మూసివేత

450 గ్రాముల మోతాదుతో.. 

450 గ్రాముల మోతాదు కలిగిన ఈ పౌడరును వేర్వేరు ప్యాకెట్లలో పైడి భీమవరంలోని రెడ్డీస్‌ ల్యాబ్‌‌కు చెందిన పౌడర్‌ విభాగంలో ఫిబ్రవరి 17న భద్రపర్చారు. అయితే అది మాయమైందని మార్చి 3న గుర్తించారు. ఔషధ పరిశోధనలు చేసే ఫార్మా కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసేవారిని లోబరచుకుని ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సదరు పౌడరును భద్రపర్చే  విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిపై రెడ్డీస్‌ ల్యాబ్‌‌ వేటు వేసినట్టు సమాచారం. మనదేశంలోనే అగ్రగామి ఫార్మా కంపెనీల్లో రెడ్డీస్ ల్యాబ్ ఒకటి. తెలుగు జాతి గర్వించే స్థాయిలో ఫార్మా వ్యాపారాన్ని ఈ కంపెనీ నడుపుతోంది.

Also Read :Pawan Kalyan : ఆయ‌న‌కు త‌మ్ముడిగా పుట్టినందుకు గ‌ర్వంగా ఉంది : చిరుపై ప‌వ‌న్ పోస్ట్‌