ఎన్నికల్లో వైసీపీ(YCP)కి పరాజయం తర్వాత పార్టీలో అసంతృప్తి స్వరం వినిపిస్తోంది. కేవలం 11 సీట్లకే పరిమితం అయిన ఈ పార్టీ, కొన్ని జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేదు. ముఖ్యంగా జగన్ సొంత జిల్లైన కడపలో పార్టీ పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధ (Dasari Sudha) పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఆమె పై స్థానికంగా వ్యతిరేక వర్గాలు తీవ్రంగా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అభివృద్ధి పనులపై విమర్శలు, వైసీపీ నేతల అసమ్మతి వల్ల ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan : పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోవాలి : పవన్ కల్యాణ్
తన నియోజకవర్గ సమస్యలు, స్థానిక విభేదాలను అధినేత జగన్మోహన్ రెడ్డికి వివరించేందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఎమ్మెల్యే సుధకు రెండు రోజుల పాటు ఎదురుచూసినప్పటికీ, ఆమెకు అవకాశం ఇవ్వలేదని సమాచారం. పైగా ఆమె స్థానికంగా అవినాష్ రెడ్డి వర్గానికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై కూడా అసంతృప్తిగా ఉన్నారు. తాను చెప్పిన విషయాలకు పార్టీలో స్పందన లేదన్న భావన ఆమెను బాధించిందట. ఇదే సమయంలో కూటమిలోని ఇతర పార్టీలు ఆమెను సంప్రదించారని, జనసేనలో చేరితే గౌరవస్థానం కల్పిస్తామన్న హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు ఎమ్మెల్యే సుధ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఆమె జనసేనతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే వైసీపీ వర్గీయులు మాత్రం ఆమె పార్టీకి నిబద్ధురాలని చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో, ఎమ్మెల్యేలు పార్టీ విడిచినా పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు. మరి సుధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.