Site icon HashtagU Telugu

Srivani Trust Funds: శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి

Tirumala Temple

Ttd Board Members Meeting under Chairman YV Subbareddy

Srivani Trust Funds: శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) నిధుల (Srivani Trust Funds)పై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి. సుబ్బారెడ్డి, ఈవో ఎవి. ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ టీటీడీ బోర్డు తీర్మానం నం. 388 ప్రకారం సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాలు, చిన్న ఆలయాల(భజనమందిరాలు) నిర్మాణానికి తోడ్పాటును అందించే ప్రధాన లక్ష్యంతో 2018 ఆగస్టు 28న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైందన్నారు. అదేవిధంగా, 2019 సెప్టెంబర్‌ 23న బోర్డు తీర్మానం 23 ప్రకారం శ్రీవాణికి రూ. 10, 000 విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి విఐపి బ్రేక్‌ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.

అప్పటినుండి ట్రస్టు వాస్తవ కార్యాచరణ ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి గాను టీటీడీ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి నిధులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మే 31వ తేదీ వరకు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో భక్తులు శ్రీవారికి రూ. 860 కోట్లకు పైగా విరాళాలు అందించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా 8. 25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ. 93 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ. 10 లక్షల వ్యయంతో మొత్తం 2, 273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని, వీటిలో 1953 ఆలయాలను ఎపి దేవాదాయ శాఖ, 320 ఆలయాలను సమరసత సేవ ఫౌండేషన్‌ నిర్మిస్తాయని వివరించారు.

Also Read: Ayodhya: అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి

టీటీడీ పరిపాలన పూర్తి పారదర్శకంగా నడుస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఆస్తులు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేశామని ఛైర్మన్‌ చెప్పారు. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల వినియోగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. శ్రీవాణి నిధుల వినియోగంపై సందేహాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ నిధులను పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాలకు వినియోగిస్తున్నామని పునరుద్ఘాటించారు.

ఈవో ఎవి. ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు నిధుల వ్యవహారంపై కొందరు పీఠాధిపతులు, వీహెచ్‌పీ నేతలు తనను కలిసినప్పుడు అన్ని పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బ్యాలెన్స్‌ మొత్తం వివరాలు చూపానన్నారు. ఈ వివరాలపై విశ్వహిందూ పరిషత్‌ సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు రాఘవులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఎవరైనా నిరాధార ఆరోపణలు చేసే ముందు లక్షలాది మంది భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకోవాలని, ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.