అల్లూరి జిల్లా మన్యంలో (Alluri district in Manyam)…… కొండ కోనల నుంచి మంచానపడ్డ గిరిజనులను ఆసుపత్రులకు (Tribals to hospitals) తరలించాలంటే గగనంగా మారింది. కొండలు, లోయలను దాటుకొని అటవీ మార్గం మీదుగా డోలీ కట్టుకొని నడుస్తూ గిరిజనులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. రోగులను ఆసుపత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆసుపత్రికి తరలించే సరికి ఆలస్యం అవుతుండటంతో రోగాలకు మరణాలు తప్పడం లేదు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి(మ) గుమ్మా పంచాయతీలోని కర్రిగూడకు చెందిన సుక్రమ్మ డోలిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. వాంతులు, విరోచనాలతో రెండ్రోజులుగా బాధపడుతున్న ఆమెను డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోజు రోజుకు దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న..ఏపీలోని మన్యం ప్రాంతాల్లో మాత్రం సరైన రోడ్డు సదుపాయాలు లేక గిరిజనుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కనీసం సకాలంలో వైద్యం చేయించుకుందామని పట్టణానికి వెళ్ళడానికి రోడ్డు మార్గాలు లేక డోలి కట్టుకుని..వెళ్తున్న చివరకు ఆ డోలీలోనే మృతి చెందుతున్నారు. గిరిజనుల మరణాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామంటున్న పాలకుల మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. ఏజెన్సీలో నెలలు నిండిన గర్భిణులతోపాటు ప్రసవ సమయంలో తల్లీబిడ్డ మరణాలు, సకాలంలో వైద్యం అందకపోవడం అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా కనీస రహదారి సదుపాయం లేని మారుమూల గ్రామాల్లోనే ఇటువంటి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.
కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని శివారు పల్లెలు కావడంతో పురిటి నొప్పులు వచ్చిన గర్భిణులను సకాలంలో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది. ఆసుపత్రికి తరలించే ముందు డోలి మోస్తూ మాకు రహదారులు నిర్మించండి మహాప్రభు అంటూ గిరిజనులు మొరపెట్టుకున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఈ డోలిమోతలు, మరణాలు అని విచారం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు బాగోలేదని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని, గ్రామానికి కనీసం ద్విచక్రవాహనం కూడా రాలేని పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. పాలకులు ఇప్పటికైనా కనికరించండని.. తమ గ్రామానికి రహదారి నిర్మించాలని వారు వేడుకుంటున్నారు.
Read Also : Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న నన్ను వదిలెయ్యండి..ప్లీజ్ అంటూ శ్రీ రెడ్డి లేఖ