వేసవి సెలవులు (Summer Holidays) చివరి దశకు చేరడంతో రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టింది. జూన్ నెలలో మొత్తం 150 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రత్యేక రైలు జూన్ 12 నుంచి జూలై 30 వరకు వారానికి ఒకసారి గురువారం నడుస్తుంది. సికింద్రాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరి, శుక్రవారం ఉదయం కాకినాడకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు స్టేషన్ల వివరాలు మరియు ప్రయాణ సౌకర్యాలు
ఈ ప్రత్యేక రైళ్లు మిర్యాలగూడ, నల్లగొండ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి వంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో ఫస్ట్ AC, సెకండ్ AC, థర్డ్ AC తో పాటు జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా కాకినాడ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు ప్రతి శుక్రవారం ఉదయం బయలుదేరి శనివారం సికింద్రాబాద్ చేరుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, ఈ ప్రత్యేక రైలు మాత్రం అక్కడి నుంచే బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. దీంతో చర్లపల్లి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులకు అనుకూలత కలిగింది.
చర్లపల్లి నుంచి విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌కు నాలుగవ అతి పెద్ద రైల్వే టెర్మినల్‌గా చర్లపల్లి(Charlapalli Railway Station)ని అభివృద్ధి చేస్తూ, అక్కడి నుంచి కూడా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు SCR సిద్ధమైంది. జూన్ 6 నుంచి జూలై 25 వరకు విశాఖపట్నం–చర్లపల్లి మార్గంలో ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో జూన్ 7 నుంచి జూలై 26 వరకు మరో ఎనిమిది రైళ్లు సేవలందిస్తాయి. ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడతాయి. ప్రయాణికులు రైల్వే వెబ్‌సైట్ లేదా యాప్‌ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకొని, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.