Weather Report : రాబోయే 2 రోజులు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈరోజు వాయుగుండం తీరం దాటబోతోందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు ఏపీలో రోజంతా మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 2 తర్వాత కోస్తాంధ్రలో వర్షం మొదలయ్యే సూచనలు ఉన్నాయి. కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఎదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈరోజు మధ్యాహ్నం 3 తర్వాత ఉత్తరాంధ్రలో వర్షాలుపడొచ్చు. శుక్రవారం కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాయలసీమలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అయితే కొంత ఉక్కపోత తగ్గుతుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది. వర్షాలు, వరదలు, పిడుగుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Also Read :CM Revanth Reddy : మంత్రులకు పార్టీ ఇచ్చిన సీఎం రేవంత్
తెలంగాణలో..
తెలంగాణలో పలుచోట్ల ఈ రోజంతా వర్ష సూచన(Weather Report) ఉంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. సాయంత్రం 4 తర్వాత వర్షాలు పెరగొచ్చు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు వర్షాలు కంటిన్యూ కావచ్చు.
అల్పపీడనంపై అప్‌డేట్ ఇదీ..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని భువనేశ్వర్‌కు దగ్గర్లో ఉంది. ఇది క్రమంగా బెంగాల్ వైపు కదులుతోంది. ఈరోజు సాయంత్రానికి అది కోల్‌కతాకు దగ్గర్లోని హైదా దగ్గర తీరం దాటొచ్చు. దీని వేగం గంటకు 50 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల ఈరోజు సాయంత్రం నుంచి ఏపీ, తెలంగాణకి భారీ వర్ష సూచన ఉంది. తీరం దాటాక అది బలహీన పడుతుందో, మరింత బలపడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది.