YS Viveka : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షుల మరణాలపై తమకు అనుమానం ఉందని ఆమె తెలిపారు. ఈ కేసులోని సాక్షులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సునీత ఆరోపించారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి. ఈ సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో సునీత మాట్లాడారు.
Also Read :Men Vs Marriage : పురుషుల బరువుకు పెళ్లితో లింకు.. సంచలన నివేదిక
నిందితులంతా బయటే తిరుగుతున్నారు
‘‘మా నాన్న హత్యకు గురై ఆరేళ్లు అయింది. ఈ కేసులో ఇంకా మాకు న్యాయం జరగలేదు. సీబీఐ కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగితా వాళ్లంతా బయటే తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలు పెడుతుందని ఆశిస్తున్నా. సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులైన వారు మేనేజ్ చేస్తున్నారనే అనుమానం వస్తోంది’’ అని వైఎస్ సునీతా రెడ్డి పేర్కొన్నారు.‘‘ఈ కేసులో నిందితుల కంటే.. మాకు, మా కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోంది. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి’’ అని ఆమె తెలిపారు.
Also Read :Telangana Debts: తెలంగాణ అప్పులు, ఖర్చులు, ఆర్థిక లోటు.. కొత్త వివరాలివీ
హత్య.. దర్యాప్తు..
- 2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య జరిగింది.
- ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. టీడీపీపై ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
- ఆ ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అయ్యాక.. వివేకా హత్య కేసును జగన్ అంతగా పట్టించుకోలేదు.
- వివేకా హత్య కేసుపై నాటి జగన్ సర్కారు ఫోకస్ చేయకపోవడంతో వివేకా కుమార్తె సునీతకు అనుమానం వచ్చింది.
- వైఎస్ సునీతారెడ్డి సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. దీనికి ఏపీ హైకోర్టు అంగీకారం తెలిపింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ జరుగుతోంది.
- సీబీఐ విచారణ మొదలయ్యాకే.. వివేకాది గుండెపోటు కాదని హత్య అని తేలింది.
- ఈ కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది.
- నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయాడు. అసలు విషయాలన్నీ బయటపెట్టాడు.
- ఈ కేసులో పలువురు అరెస్టయి, బెయిల్‌పై విడుదలయ్యారు.