VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం ఇంతకుముందు తిరుమల శ్రీవారి భక్తులు నానా అగచాట్లు పడేవారు. గతంలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేసేందుకు తొలుత భక్తుల వివరాలను నమోదు చేసుకుని రసీదు ఇచ్చేవారు. ఆ తర్వాత ‘ఎంబీసీ 34’ కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి.. నగదు లేదా యూపీఐ, కార్డ్ ద్వారా చెల్లించి భక్తులు టికెట్‌ను పొందేవారు. ఈక్రమంలో భక్తుల ఎంతో సమయం వేస్ట్ అయ్యేది. ఇకపై ఇంత వెయిటింగ్ అక్కర్లేదు. ఎందుకంటే.. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనూ లభించనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్‌కు ఓ లింక్‌తో కూడిన మెసేజ్‌ను పంపుతారు. భక్తులు ఆ లింకు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తే వెంటనే టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల(VIP Break Darshan Ticket) జారీ కోసం గత మూడు రోజులుగా టీటీడీ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేస్తోంది. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొన్న తర్వాత పూర్తిస్థాయిలో ఈ పద్ధతిని అమల్లోకి తేనున్నారు. ఇప్పటికే ఆర్జిత సేవలకు కరెంట్ బుకింగ్ లక్కీడిప్‌లో టికెట్ పొందిన భక్తులు ఎస్‌ఎంఎస్ పేలింక్ ద్వారా నగదు చెల్లించి దర్శన టికెట్‌ను పొందుతున్నారు. ఇదే విధానాన్ని వీఐపీ బ్రేక్ దర్శనానికి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Also Read : Anti Cheating Bill : అక్రమార్కులకు ఖబడ్దార్.. లోక్‌సభలోకి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్’ బిల్లు
తిరుమల శ్రీవారికి అరుదైన విరాళం
తిరుమల శ్రీవారికి సోమవారం బిగాస్ సంస్థ ప్రతినిధులు విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ వాహనం ధర రూ.1.20 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా ఆలయం దగ్గర ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ జానకీరామ్ రెడ్డి, తిరుపతికి చెందిన గాయత్రి ఆటోమోటివ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
7న తిరుమలలో “శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక”
కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు తిరుమల ఆస్థాన మండపంలో జరుగనున్నాయి. ఫిబ్రవరి 7న బుధవారం తిరుమలలోని కల్యాణవేదికలో రాత్రి 7 గంటలకు యువ కళాకారులతో “శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక” గోష్టిగానం నిర్వహించనున్నారు. శ్రీ పురందరదాసు 4.75 లక్షలకు పైగా సంకీర్తనలు రచించారు. వీటిలో ప్రధానమైన తొమ్మిది సంకీర్తనలను దాదాపు 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్టిగానం చేస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.