CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజుకి సరిగ్గా మూడేళ్ల క్రితం (19-11-2021), టీడీపీ అధ్యక్షుడు, అప్పటి విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, నాటి స్పీకర్ తమ్మినేని సీతారామ్ పదేపదే ఆయన మైక్‌ను కట్ చేయడం, అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేల హేళనల నడుమ, చంద్రబాబు తీవ్ర అసహనంతో అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి సభ వాయిదా:
2021 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలకు అడ్డంకిగా మారడంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో నిరసన తెలుపుతున్న మిగితా టీడీపీ సభ్యులను తమ స్థానాల్లో కూర్చుని సంయమనం పాటించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ, సభలో గందరగోళం కొనసాగింది. దీంతో, మిగతా సభ్యులు కూడా సభా కార్యక్రమంలో అడ్డంకిగా మారడంతో 11:25 గంటలకు సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.
సభలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు:
నవంబర్ 19న మధ్యాహ్నం 12:13 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే, వ్యవసాయ శాఖ మంత్రి తాను హెరిటేజ్‌కు సంబంధించిన ఏదైనా అంశంపై మాట్లాడితే చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెబుతారని అనడంపై ప్రతిపక్ష నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పట్టుబట్టడంతో చంద్రబాబు మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇచ్చారు.
అధికార వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న అభ్యంతరకర వైఖరిని తాను ఎప్పుడూ చూడలేదని, తనను పదేపదే అవమానించారని అన్నారు. “తాను ప్రతిష్ట, గౌరవం కోసం ప్రయత్నిస్తానని తన భార్య పేరును కూడా లాగారని అంటుండగా…” చంద్రబాబు మైక్ కట్ అయ్యింది.
అంతకుముందు చంద్రబాబు సతీమణిని కించపరిచేలా వైసీపీ సభ్యులు వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు కలత చెందారు. దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన విమర్శలు చేయడంతో సభలో అవమానించేలా వ్యవహరిస్తున్నారని భావించారు.
మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడంతో సభలో మళ్లీ అడుగు పెట్టనని సవాలు చేశారు. అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని దానిని గౌరవ సభగా మార్చిన తర్వాత అడుగుపెడతానని నిష్క్రమించారు. ఆయన వెంట అచ్చన్నాయుడు మిగిలిన సభ్యులు వెళ్లిపోయారు. వైసీపీ పతనం మొదలైందని అచ్చన్నాయుడు వ్యాఖ్యినించడం వీడియోల్లో కనిపించింది.
చంద్రబాబు ఆవేదన: కుటుంబంపై దూషణ, భార్యపై అవమానం
ఆ తర్వాత మీడియాతో మాట్లాడే క్రమంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని తన కుటుంబ సభ్యులను దూషిస్తున్నారని ఆవేదక వ్యక్తం చేశారు.
2021లో వ్యవసాయం, రైతుల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి ఎస్ అప్పల రాజు గుజరాత్ కంపెనీలకు అనుకూలంగా రాష్ట్రంలోని కంపెనీలను విస్మరిస్తున్నారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను విమర్శించారు.
“తన హెరిటేజ్ కంపెనీ కోసం, నాయుడు సహకార డెయిరీలను పనికిరాని విధంగా చేయడానికి ప్రణాళికలు రచించారని” ఆరోపించారు. 1978 నుంచి టీడీపీ అధినేత వివిధ పార్టీలతో ఎలా పొత్తు పెట్టుకున్నారో, ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు.
సభ నుంచి నిష్క్రమించిన తర్వాత చంద్రబాబు తన భార్య భువనేశ్వరిపై పరుషమైన, అవమానకరమైన మాటల దాడి చేయడాన్ని ప్రశ్నించారు. ‘‘ రెండున్నరేళ్లుగా అవమానాలు భరిస్తూ ప్రశాంతంగా ఉన్నా.. ఈరోజు నా భార్యను కూడా టార్గెట్ చేశారు.. నా భార్య రాజకీయాల్లోకి కూడా రాలేదు.. నేనెప్పుడూ గౌరవంగా జీవించాను. ఇక భరించలేను” అని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ “డ్రామా”గా అభివర్ణించింది:
ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ డ్రామాగా అభివర్ణించింది. చేసిన వ్యాఖ్యలపై ప్రకటన చేసే అవకాశం కూడా ఇవ్వలేదని .. అందుకే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నానని, తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు అనడం వీడియోల్లో కనిపించింది.