AP Ministers Issue: ఏపీలో ముగ్గురు కొత్త మంత్రులను చుట్టుముట్టిన వివాదాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రుల ఆరాటం.. ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మరికొందరిని అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి.

  • Written By:
  • Updated On - April 16, 2022 / 12:12 PM IST

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రుల ఆరాటం.. ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మరికొందరిని అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సొంత నియోజకవర్గం కల్యాణదుర్గానికి భారీ కాన్వాయ్ తో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆమె ర్యాలీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదే ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది.

అనంతపురం జిల్లాకు చెందిన గణేశ్, ఈరక్కలకు ఇద్దరు కుమార్తెలు. ఇందులో చిన్నదాని పేరు పండు. తన వయసు కేవలం 8 నెలలు మాత్రమే. ఆమెకు అనారోగ్యం చేయడంతో కల్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్దామనుకున్నారు. కానీ మంత్రి ఇంటి సమీప ప్రాంతానికి వచ్చేసరికీ.. అక్కడ బారికేడ్లు ఉన్నాయి. అప్పటికే బ్రహ్మయ్య గుడి వద్ద విధుల్లో ఉన్న పోలీసులు.. వీరిని అడ్డుకున్నారు. అర్జంట్ గా ఆసుపత్రికి వెళ్లాలని.. తాము వెళ్లడానికి అనుమతించాలని బతిమిలాడినా వాళ్లు కనికరించలేదు.

చివరకు అరగంట గడిచిన తరువాత మాత్రమే ఆ చిన్నారిని, ఆమె కుటుంబసభ్యులను విడిచిపెట్టారు. అప్పుడు వేగంగా ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ అప్పటికే చిన్నారి మృతి చెందింది. సమయానికి తీసుకొచ్చి ఉంటే కాపాడగలిగేవారమని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. దీంతో ఆ చిన్నారి మృతదేహంతోనే టీ-సర్కిల్ లో కొన్ని గంటలపాటు నిరసన తెలిపారు. అయినా సరే వారిని పట్టించుకోకుండా మంత్రి వెళ్లిపోయారు. తరువాతైనా సరే వారిని పరామర్శించకపోవడంతో మంత్రి వైఖరి వివాదాస్పదంగా మారింది.

మరో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా వివాదంలో చిక్కుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయిల ఆస్తులు ఉన్నాయని కాకాణి గోవర్థన్ రెడ్డి 2017లో ఆరోపణలు చేశారు. ఆ ఆస్తుల డాక్యుమెంట్లంటూ కొన్ని పత్రాలను కూడా మీడియాకు విడుదల చేశారు. అయితే అవన్నీ నకిలీ పత్రాలని.. తనపై అసత్య ఆరోపణలు చేశారని.. చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి అప్పుడే నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి అవి నకీలీ పత్రాలని నిర్థారించారు. దీనిపై అప్పుడే ఛార్జ్ షీటు కూడా దాఖలు చేశారు. కాకాణిని A-1 నిందితుడిగా చేర్చారు. మరో ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు. ఈ కేసు నెల్లూరులోని నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి.. కోర్టులోనే భద్రపరిచారు. కానీ ఇప్పుడీ కోర్టులో దొంగతనం జరిగింది. కాకాణి కేసుకు సంబంధించిన కొన్ని పత్రాలు, సాక్ష్యాధారాలు చోరీ జరిగాయని గుర్తించారు. కోర్టు ప్రాంగణంలోనే కొన్ని పత్రాలను పడేశారు. అందులో కాకాణిపై సోమిరెడ్డి పెట్టిన కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. ఈ కేసులో ఏ-2 నిందితుడి పాస్ పోర్టు ను కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.

ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి అయిన కొట్టు సత్యనారాయణకు కూడా చేదు అనుభవం తప్పలేదు. ఆయన దర్శనానికి వస్తున్నారంటూ శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొన్ని గంటలపాటు భక్తులను క్యూలైన్లలోనే ఉంచేశారు. కంచుగడప వద్ద క్యూలైన్లను ఆపేయడంతో భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సరిగ్గా అదే సమయానికి మంత్రి కొట్టు అటువైపు వచ్చారు. అప్పటికే వేసవి ఉక్కతో అల్లాడిపోతున్న భక్తులు మంత్రి కొట్టును నిలదీశారు. అసలే వరుస సెలవుల వల్ల భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో మంత్రి అక్కడున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఏపీలో కొత్తమంత్రుల తీరుతెన్నులు అప్పుడే వివాదాస్పదమవుతున్నాయన్న విమర్శలు మొదలయ్యాయి.