తిరుమల కొండ (Tirumala Temple)పై హెలికాప్టర్లు (Helicopters)చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు హెలికాప్టర్లు కొండపైకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం ఆలయ సమీపంలోని ప్రాంతంలో హెలికాప్టర్లు ఎగురుతూ కనిపించాయి. తిరుమల నో ఫ్లైయింగ్ జోన్ అన్న సంగతి తెలిసిందే. నో ఫ్లైయింగ్ జోన్‌లో ఏమీ ప్రయాణించకూడదనే నిబంధన ఉంది. అయితే ఈ హెలికాప్టర్లు శ్రీవారి ఆలయ సమీపం నుంచే వెళ్లడం గమనార్హం.
శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలజీనగర్ ఉపరితలంపై నుంచి హెలికాప్టర్‌లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు హెలికాప్టర్ల గురించిన వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా, తిరుమల కొండపై నుంచి వెళ్లిన హెలికాప్టర్లు వైమానిక దళానికి చెందినవని అధికారులు గుర్తించారు. కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల మీదుగా హెలికాప్టర్లు వెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: Heavy Rains: భారీ వడగళ్ల వర్షం.. పలు జిల్లాల్లో బీభత్సం!
అయితే నో ఫ్లైయింగ్ జోన్‌లో హెలికాప్టర్‌ను ఎలా అనుమతించారనేది ప్రశ్నార్థకంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తిరుమల కొండపైకి హెలికాప్టర్లు వెళ్లడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. అసలు హెలికాప్టర్లు కొండపై నుంచి వెళ్లడానికి కారణమేమిటనే దానిపై విచారణ చేపట్టారు. ఈ విషయమై ఎయిర్‌పోర్టు అధికారులతో చర్చించినట్లు సమాచారం. కడప నుంచి చెన్నై వెళ్తున్న వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, గతంలో తిరుమలలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుమలలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా చేపట్టిన సర్వేకు ఓ కంపెనీ డ్రోన్లను వినియోగించడం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.