ఆంధ్రప్రదేశ్ (AP) లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఇదే మంచి సమయమని అమెరికా పర్యటన లో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో లోకేష్ రెండు రోజులుగా బిజీ బిజీ గా గడుపుతున్నారు. లాస్‌వెగాస్ నగరంలో నిర్వహించిన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొని.. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి, రెవేచర్ సీఈవో అశ్విన్‌భరత్, అలాగే సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో లోకేష్ భేటీ అయ్యి… ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతల గురించి వారికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఇదే మంచి సమయమని ఈ సందర్బంగా అన్నారు. అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. త్వరలో అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను లోకేశ్ కోరారు. సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు AWS నాయకత్వం ఉపకరిస్తుందని తెలిపారు.
పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి AWS కట్టుబడి ఉండటం 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఉందని తెలిపారు. స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయని లోకేశ్ తెలిపారు.