Rise Of Nara Lokesh: నారా లోకేశ్‌కు ప్రమోషన్ దక్కబోతోంది. ఈరోజు నుంచి మే 29 వరకు కడప గడపలో జరగనున్న టీడీపీ మహానాడు వేదికగా దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. ఇది కొన్ని నెలలు, కొన్ని రోజుల శ్రమతో వచ్చిన ఫలితం కాదు. ఇందుకోసం దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు లోకేశ్ అలుపెరగకుండా శ్రమించారు. ప్రజలతో మమేకం అయ్యారు. తానేంటో నిరూపించుకున్నారు. జనంలో తనకూ ఫాలోయింగ్ ఉందని చాటుకున్నారు.
Also Read :CM Chandrababu : పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి.. డిజిటల్ కరెన్సీతో అవినీతి అంతం : చంద్రబాబు
లోకేశ్.. జనం మెచ్చిన నేత
2015 అక్టోబరులో టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. నారా లోకేశ్‌ను తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. దీంతో టీడీపీ క్యాడర్ హర్షధ్వానాలు చేసింది. విమర్శకులు మాత్రం.. “ఇంకో రాజకీయ వారసుడు వస్తున్నాడు” అని చర్చించుకున్నారు. అవన్నీ లోకేశ్(Rise Of Nara Lokesh) పట్టించుకోలేదు. నేరుగా వెళ్లి జనంతో మమేకం అయ్యారు. వారి మనిషిగా మారారు. ఇప్పుడు లోకేశ్‌ను రాజకీయ వారసుడిగా ఎవరూ చూడటం లేదు. ఆయన్ను జననేతగా చూస్తున్నారు. జనంలో నుంచి పుట్టుకొచ్చిన నేతగా చూస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అఖండ విజయంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. పదేళ్ల పాటు జనంతో మమేకమై తాను సాధించింది ఏమిటో ఈ ఫలితం ద్వారా అందరికీ లోకేశ్ చూపించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌కు ఇచ్చే బాధ్యత కేవలం పదోన్నతి కాదు.. అదొక గొప్ప సందేశం.. టీడీపీకి తదుపరి తరం నాయకత్వం సిద్ధంగా ఉందనే సందేశాన్ని రాజకీయ వర్గాల్లోకి పంపే ప్రయత్నం.
Also Read :TDP National President : టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
చెమట చిందించి.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దాకా..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేశారు. అది పార్టీ పునర్నిర్మాణానికి మార్గసూచిగా మారింది. టీడీపీ కూడా ఇప్పుడు అదే దారిలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈవిషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. లోకేశ్ ఈ పదవిని పొందేందుకు చాలా చెమటను చిందించారు. లక్షలాది మంది ప్రజలను కలిశారు. ఎన్నికల్లో గెలిచి చూపించారు. గత ఎన్నికల్లో టీడీపీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇవన్నీ చేశాకే.. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వబోతున్నారు.
టీడీపీ వర్గాలు ఏమంటున్నాయంటే..
టీడీపీ వర్గాల కథనం ప్రకారం.. లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడం దాదాపుగా ఖాయమైంది. అధికారిక ప్రకటన మహానాడు ముగింపు రోజున వెలువడే అవకాశం ఉంది. “లోకేశ్ ఇప్పటికే తనదైన శైలిలో టీడీపీని ముందుకు నడిపిస్తున్నారు. ఇది కేవలం అధికారిక ప్రకటన మాత్రమే” అని సీనియర్ నేత ఒకరు తెలిపారు.
2019లో ఓటమి తర్వాత లోకేశ్ ఏం చేశారంటే..
2019లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని రాజకీయంగా తీవ్ర ఎదురుదెబ్బ తింది. ఆనాడు లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయారు. దీంతో పార్టీలో, ప్రజల్లో ఆయన ప్రతిష్ట గణనీయంగా తగ్గింది. సోషల్ మీడియాలో “బ్యాక్ ఆఫీస్ బాయ్” అని ఎద్దేవా చేశారు. అవన్నీ లోకేశ్ పట్టించుకోలేదు. ఆయన డిజిటల్ సభ్యత్వ డ్రైవ్ ద్వారా ఐదు మిలియన్లకుపైగా కొత్త సభ్యులను టీడీపీలో నమోదు చేశారు. స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో చదువుకున్న బిజినెస్ స్కిల్స్‌ను ఉపయోగించి, పార్టీని గ్రామీణ స్థాయిలో విస్తరించేందుకు డేటా ఆధారిత ప్రణాళికను అమలు చేశారు. అంతకంటే ముఖ్యంగా, ఆయన స్వయంగా ప్రజల మధ్య రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
యువగళం పాదయాత్ర.. సామాన్యులకు చేరువైన టీడీపీ
2023 జనవరిలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజులపాటు 4,000 కిలోమీటర్ల మేర 28,000 అడుగుల పాదయాత్ర చేశారు. ఇది ఆయన శారీరక సహనానికి పెద్ద పరీక్షగా పరిణమించింది. ప్రజలలో లోకేశ్‌పై ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయాణంగా ఇది నిలిచింది. వృద్ధులతో చెయ్యిపట్టుకుని మాట్లాడడం, యువతతో సరదాగా జోకులు పంచుకోవడం, ప్రతి విన్నపాన్ని ఒక చిన్న నోట్‌బుక్‌లో నమోదు చేయడం.. వంటి చర్యల ద్వారా ప్రజలకు లోకేశ్ చేరువయ్యారు. ఒకప్పుడు కేవలం ఎలైట్ వర్గాల పార్టీగా పేరొందిన టీడీపీని సామాన్యుల ఇళ్లు, గుడిసెల వరకు లోకేశ్ చేర్చారు.తన పాదయాత్ర 100వ రోజున లోకేశ్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఇంకా ఎన్నో మైళ్లుంటాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత..
దీంతో వెంటనే వచ్చిన ప్రకంపన చంద్రబాబు అరెస్ట్. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనను జగన్ అరెస్టు చేయించారు. దీంతో లోకేశ్ తన పాదయాత్రను ఆపేసి, అమరావతికి చేరుకొని పార్టీ బాధ్యతలు స్వీకరించారు. పోలిట్ బ్యూరో సమావేశాలు నిర్వహించడం, సీనియర్ న్యాయవాదులతో చర్చించడం, పార్టీ నాయకత్వాన్ని ఏకం చేయడం ద్వారా తనను తాను రాజకీయ వారసుడిగా చాటుకున్నారు.
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి విషయంలో..
2024లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి 91,000 ఓట్ల మెజారిటీతో లోకేశ్ గెలిచారు. కూటమిగా టీడీపీ – జనసేన -బీజేపీ మొత్తం 175 సీట్లకుగానూ 164 గెలుచుకున్నాయి. ఈ విజయం వెనుక లోకేష్ కీలక పాత్ర పోషించారు. టీడీపీ కేడర్ సంఖ్యను పెంచడం, పార్టీ నాయకత్వం మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, చంద్రబాబు లేకుండానే పార్టీని వ్యవస్థాత్మకంగా నడిపించడం వంటివన్నీ లోకేశ్ చేసి చూపించారు. అయితే లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించే విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. టీడీపీలో కొందరు లోకేశ్‌ను ఆ పదవికి ప్రతిపాదించగా, జనసేన అభ్యంతరాలు చెప్పింది. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆ పదవిలో ఉన్నందున, మరో వ్యక్తిని ఆ స్థాయికి తెచ్చే ప్రయత్నం అన్యాయమని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. చివరికి ఆ ప్రతిపాదనను వదిలేశారు. లోకేశ్ మాత్రం ఈ విషయంలో లౌక్యంగా వ్యవహరిస్తూ, తనకున్న HRD, ఐటీ శాఖలు చాలు అని చెప్పారు. తనకు డిప్యూటీ సీఎం పోస్టు అంశంపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని టీడీపీ నేతలకు లోకేశ్ సూచనలు ఇచ్చారు. ఈవిషయంలో టీడీపీ, జనసేన పార్టీలు అప్రమత్తంగా వ్యవహరించి, ప్రత్యర్థి పార్టీలకు లాభం జరగకుండా జాగ్రత్త పడ్డాయి.
లోకేశ్ రాజకీయ పటిమను గుర్తించిన ప్రత్యర్ధులు
డిప్యూటీ సీఎం పదవి రాకపోయినా.. జననేతగా నారా లోకేశ్ ఉజ్వల వికాసం కొనసాగుతోంది. ఇటీవలే ఢిల్లీ పర్యటనలో లోకేశ్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ప్రధాని మోడీని కలిశారు. 42 ఏళ్ల వయసులో లోకేష్ టెక్నాలజీ, మానవ సంబంధాలను కలుపుకొని ముందుకు సాగుతూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ఆయనపై ప్రత్యర్ధి పార్టీల ఎద్దేవాలు తగ్గిపోయాయి. ప్రత్యర్థులు కూడా లోకేశ్ రాజకీయ పటిమను గుర్తిస్తున్నారు.
అధినాయకుడు చంద్రబాబే
ఇక ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నా, టీడీపీ పగ్గాలను వదిలే ఆలోచనలో లేరు. ప్రస్తుతం టీడీపీకి ఆత్మ, వ్యూహకర్త, ప్రముఖ ప్రచారకుడు చంద్రబాబే. లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారు.. కానీ టీడీపీని నడిపే ఇంజిన్ చంద్రబాబే. లోకేశ్‌కు టీడీపీ కీలక బాధ్యతలు దక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. మహానాడు ద్వారా ఒక పదవి లోకేశ్‌కు దక్కుతుంది. కానీ టీడీపీ అధి నాయకత్వం మాత్రం చంద్రబాబు పరిధిలోనే ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.