NTR: ది లెజెండ్, ఒకే ఒక్కడు ఎన్.టి.ఆర్

ఎన్.టి.ఆర్ అంటే మూడక్షరాల వైబ్రేషన్ అని , పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారని , సినిమాల్లో మూడు వందలకు..

  • Written By:
  • Updated On - March 29, 2023 / 06:11 PM IST

Nandamuri Taraka Ramararao (NTR) : ఎన్.టి.ఆర్ అంటే మూడక్షరాల వైబ్రేషన్ అని , పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారని , సినిమాల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాడని , ప్రతి నాయకుడి పాత్రలను కూడా నటించి మెప్పించాడని ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ ఆయనలో గూడుకట్టుకుని ఉండిపోయిన భావాల నుండీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని ఎంత మందికి తెల్సును. ఆయనేదో అప్పుడు కప్పుడు అనుకుని పార్టీ స్థాపించ లేదు. నాదెండ్ల భాస్కరరావు చెప్పు కుంటున్నట్లు తానే టిడిపి డిజైన్ చేసి ఎన్.టి.ఆర్ (NTR) ను ఒప్పించి పార్టీ స్థాపనకు మూల కారకుణ్ణి అనే మాటలు ఉత్త సొల్లు కబుర్లు. అదెట్లాగో తెల్సుకోవాలంటే , ఎం.టి.ఆర్ అంతరంగం తెల్సుకోవాలి. ఈ రాష్ట్రం తెలుగువారిది . తెలుగు మాట్లాడే వారందరూ ఇది నా రాష్ట్రం, ఇందులోని ప్రతి ఒక్కరూ ఇది నా జాతి అనుకోవాలి . అందుచేత ఆంధ్రప్రదేశ్ పేరును ” తెలుగు నాడు ” గా మార్చాలి . అప్పుడే ఆ పేరులో తెలుగుదనం ప్రతి ఫలిస్తుంది . అప్పుడే తెలుగు ప్రజలంతా ఏకీకృతం కాగలుగుతారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. తెలుగుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన ఆంధ్రుల అన్న శ్రీ ఎన్.టి.ఆర్. ఈ మాటలు వారి నోటి నుండి బహిరంగ సభలో వెలువడి నాయి. ఇది నిజమా ? ఎక్కడ , ఎప్పుడు అన్నది తెలుసుకోవాలి అంటే వెనక్కు వెళ్ళాలి . అది 1975 సం.రం. ఆరోజే విభజన వాదాన్ని వ్యతి రేకించి , దాన్ని మనసులో దాచుకోకుండా వెళ్ళగక్కారు. అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలని ఎ.పి ప్రభుత్వం నిర్ణయించింది.

దానికి తెలుగు చిత్ర కళాకారుల సంఘం కూడా సహకారం అందించింది . అప్పుడు ఆ సంస్థకు అధ్యక్షు లుగా శ్రీ గుమ్మడి వెంకటేశ్వర రావు గారు ఉండేవారు . ఆ సంస్థ తరుపున సినీ కళాకారులు రాష్ట్రమంతా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి , ఆ ప్రదర్శనల ద్వారా వచ్చిన 30 లక్షల ధనాన్ని ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు అందించడం జరిగింది. ఆ ప్రదర్శనలకు శ్రీ ఎన్.టి.ఆర్ (NTR) హైద్రాబాద్, విజయవాడ, భీమవరం లలో జరిగిన కార్య క్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు జాతి ఉనికిని ప్రపంచానికి చాటడానికి , తెలుగు జాతి అభ్యున్నతికి ప్రభుత్వం నిర్వ హిస్తున్న ఇలాంటి కార్య క్రమాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయని , తెలుగు జాతి కోసం తన చేయూత కూడా ఎళ్ళవేళలా ఉంటుందని ఆ సభల్లో ప్రసంగించారు . ఇదే సభలో శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు కూడా ప్రసంగిం చారు. తెలుగు జాతి, తెలుగు సంస్కృతి , తెలుగు భాష లు మూడూ ఒకటే అని, వేరు వేరు కావని , ప్రాంతీయ భావాలు తెలుగుదనాన్ని , తెలుగు ప్రాంతాన్ని విడదీయ లేవని , ఒకే తాటిపై నిలబడిన రోజున సర్వతోముఖాభివృద్ధి సాధ్య మవుతుందని , దానికోసం , తెలుగు ప్రజల ఐఖ్యత కోసం తెలుగు మహాసభలు నిర్వహించు కోవడం అవసరం అని కూడా ఆ సభలో పేర్కొ న్నారు ఎన్.టి.ఆర్. కొందరు లక్షల ప్రజాధనాన్ని సభల పేరిట వృధా చేస్తున్నారని విమర్శకులు వార్తలు వదిలారు. దానికి కూడా వేదిక నుండే జవాబు ఇచ్చారు ఎన్.టి.ఆర్. జాతి ఉనికిని, జాతి అస్థిత్వాన్ని నిలుపుకోవడం కోసం ప్రతి తెలుగువాడు కృషి అవసరం అని , అందుకు ఇలాంటి మహాసభల నిర్వహణ ఆవశ్యకత ఎంతైనా ఉందని , ఇలాంటివి ముందు ముందు ఇంకా జరగాలను కూడా సూచించారు.

తెలుగువారి పిల్లలు తెలుగు మాట్లాడలేని దుస్థితి దాపురించిందని , ఆంగ్ల వ్యామోహం పెరిగిందని, పాఠశాల పుస్తకాల్లో తెలుగు సంస్కృతి , చరిత్ర తెలిపే రచనలు ఉండాలని , ఇలాంటి అనేక సూచనలు ఎన్.టి.ఆర్ (NTR) ఆరోజున చేసారు. నిధుల సేకరణలో భాగంగా విజయవాడలో కూడా కార్యక్రమాలు నిర్వహించి ప్రసంగించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు సినిమాపై ప్రత్యేక గోష్ఠి కూడా నిర్వహించారు. అందులో ఎన్.టి.ఆర్ పాల్గొని విభజన వాదాన్ని ఖండించారు. అవ కాశ వాదులు కొందరు తెలుగు జాతిని విడదీయాలని చూస్తున్నారని ఆవేదనా పూరితంగా పైన చెప్పిన ప్రసంగం చేసారు. ఆ ప్రసంగంలో ఇంకో మాట కూడా అన్నారు. ఇది నవాబులు , దొరల యుగం కాదు. ” హైద్రాబాద్ నగర పేరును భాగ్యనగరం ” గా మార్చాలి అని కూడా అన్నారు. అయితే ఆ ప్రతిపాదనను బెజవాడ గోపాలరెడ్డి గారు వ్యతిరేకించారు. వరుస క్రమంలో A క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ , దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంటుందని , తెలుగునాడుగా మారిస్తే చివరికి దిగిపోతాం అన్నారు. శ్రీ గోపాలరెడ్డి గారు ఎంత అవివేకంగా ఆలోచించారో అర్ధం అవుతోంది. తెలుగు జాతి అభివృద్ధి చెందాలి గాని వరుస క్రమంలో ఎక్కడ ఉంటేనేమి ? అదే తెలంగాణా తీసుకోండి , టి.ఆర్.ఎస్ పార్టీ ఎత్తుకోవడమే తెలంగాణా అని నినదించింది , తెలంగాణా రూపురేఖల చిత్ర పటాన్ని పార్టీ జండా గుర్తుగా చేసుకుంది.

Also Read:  TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN

రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం పేరును గెజిట్ లో తెలంగాణాగా నమోదు చేయించుకుంది. తెలంగాణా పదంలో తెలుగు అంతర్లీనంగా ఉంది. మరి భాషా ప్రేమికులు , తెలుగు జాతి ప్రేమికులు తెలంగాణా వారా ? ఆంధ్రులా ? ఎ.పి వాసులు మాత్రం నేటికీ అదే పేరుతో ఉండిపోయారు. అందుకే ఎ.పి ప్రజలు స్వార్ధ పరులని , ఆరంభ సూరులని , చివరి వరకూ నిలబడరని , అవినీతికి తొందరగా లొంగిపోతారనే అపవాదులు ఉన్నాయి. అవే నేటికి అక్షర సత్యాలై నిలబడ్డాయి . తెలంగాణా వాసుల్లో ఉన్న ఐఖ్యత ఎ.పి వాసుల్లో లేదు. అదే విషయాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం , ప్రతిపక్ష బి.జె. పి. పార్టీలు గుర్తించి ఎ.పి మాడు పగులగొట్టారు. 1975 నాటి ఎన్.టి.ఆర్ (NTR) ప్రసంగం మీద తెలుగు మహా సభలో వాడీ, వేడీ చర్చలు జరిగాయి గానీ ఎన్.టి.ఆర్ ప్రతిపాదనలు ప్రతిపాదనలు గానే మిగిలి పోయాయి. కార్య రూపం దాల్చలేదు. ఇదే విషయం ఎన్.టి.ఆర్ లో గూడుకట్టుకుని , చెదపురుగు లాగా తొలుస్తూనే ఉంది . అదే తెలుగుదేశం ఆవిర్భావానికి , దిక్సూచి అయ్యింది . తెలుగుదేశం పేరున పార్టీ పెట్టడం వల్ల , తెలుగు వారిలో భాషపట్ల అంతర్నీలంగా ఉండిపోయిన భావావేశం ఒక్కసారిగా వెల్లుబికి టి.డి.పి విజయానికి కారణమయ్యింది. తెలుగు వారి ఆత్మాభిమానంను , తెలుగు వారి గౌరవాన్ని కాపాడు కోవాలనే కాంక్ష ఆయనలో నిక్షిప్తమై , చివరకు రాజకీయ పార్టీ ఆవిర్భావానికి దారి తీసింది. తెలుగు జాతి కష్ఠంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చేతులు కట్టుకుని మద్రాస్ లోనో , హైద్రాబాద్ లోనో తొంగుని పడుకోలేదు.

19 నవంబర్ 1977 దివిసీమ ఉప్పెన వచ్చి 10 వేల మంది మరణించి నప్పుడు ఎన్.టి.ఆర్ , ఎ.ఎన్.ఆర్ లు రాష్ట్రం అంతా తిరిగి 10 లక్ష లకు పైగా నిధులు సేకరించి రామకృష్ణ మిషన్ వార్కి పునర్నిర్మాణ పనుల నిమిత్తం అందించడం జరిగింది. అలా ఏర్పడిందే ద్వారకా గ్రామం. ద్వారకా గ్రామ శంఖుస్థాపనకు ఎన్.టి.ఆర్ , ఎ.ఎన్.ఆర్ , జయసుధ గార్లు విచ్చేసారు. 1952 లో రాయల సీమకు కరువు వస్తే తోటి సినీ నటులను కల్పుకుని నెల రోజుల పాటు ప్రదర్శనలు ఇచ్చి , వీధుల వెంట జోలి పట్టగా వచ్చిన 1.50 లక్షలను రామకృష్ణ మిషన్ కు సహాయ కార్యక్రమాలకు అందజేసాడు. 1962 లో భారత్ – చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు 10 లక్షలు వసూలు చేసి భారత రక్షణ నిధికి అందించ వలసిందిగా నాటి సి.ఎం నీలం సంజీవరెడ్డికి అందించాడు. విజయవాడ – కృష్ణ లంక అగ్ని బాధితులకు లక్ష రూపాయలు సేకరించి జూన్ 1964 న అప్పటి సి.ఎం కాసు బ్రహ్మానంద రెడ్డికి అందించాడు. 1965 లో పోలీస్ కానిస్టేబుళ్ళ రక్షణ నిధికి 3 లక్షలు అందించారు. అదే సం.రం భారత్ – పాకిస్థాన్ యుద్ధ సహాయ నిధికి ఊరూరా తోటి నటులతో ప్రదర్శనలు ఇచ్చి 16 డిసెంబర్ 1965 న లాల్ బహదూర్ స్టేడియం లో నాటి సి.ఎం కాసు బ్రహ్మానంద రెడ్డి గారి చేతుల మీదుగా నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్కి అందించడం జరిగింది .

1969 లో కోస్తా తుఫాను భాధితుల సహాయార్ధం 5 లక్షలు సేకరించి ఇచ్చాడు . 1972 లో భారత్ వ్యాప్తంగా కరువు వచ్చినప్పుడు ఆరు రోజుల పాటు ప్రదర్శనలు ఇచ్చి 7 లక్షలు సేకరించి నాటి ప్రధాని ఇందిరకు అందజేసారు. ఇలా ఎ.పి ప్రజలకు , భారత ప్రజలకు ఎప్పుడు కష్ఠ, నష్ఠాలు వచ్చినా స్పందించి విరాళాలు అందించాడు . ఎం.టి.ఆర్ లో విభిన్న పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి విశ్వవిఖ్యాత నటుడు , రెండవది మహా నాయకుడు. రెండింటి లోనూ ఆయన విజయం సాధించారు. కష్ఠపడేతత్వం , క్రమశిక్షణ , సమయపాలన , ప్రజాసేవ అన్నిటికీ మార్గదర్శకంగా , ఒకే అచ్చులో పోతపోసిన శిల్పంగా నిలబడిన వ్యక్తి శ్రీ ఎన్.టి.ఆర్. అటు చిత్ర పరిశ్రమలో గాని , ఇటు ప్రజాక్షేత్రంలో గాని అలాంటి వ్యక్తి మరొకరు పుడతాడని ఆశించడం సాహసమే అవుతుంది. అందుకే ఎన్.టి.ఆర్. ” ది లెజెండ్ , ఒకే ఒక్కడు , కారణ జన్ముడు ” .

Also Read:  IPL 2023: పంత్ లేకున్నా బలంగానే ఢిల్లీ