CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని నివాళి అర్పించారు. అనంతరం పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం మన నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయింది. సంపద సృష్టించాలి.. ఆదాయం పెంచాలి. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి చేయాలి అని సీఎం పేర్కొన్నారు.
Read Also: Hyderabad Vs Earth quakes: భూకంపాల గండం.. హైదరాబాద్ సేఫేనా ? గత పదేళ్ల పాఠమేంటి ?
దేశంలో పుట్టిన ఏ వ్యక్తీ పేదరికంలో ఉండటానికి వీల్లేదు. పేదరిక నిర్మూలన జరగాలి.. తలసరి ఆదాయం పెరగాలి. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటుంది. పేదల సేవలో భాగంగా ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం. స్వయం ఉపాధి కింద అనేక పథకాలు తీసుకొచ్చాం అన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చాం. జన్మభూమి పిలుపునిచ్చినప్పుడు అందరూ స్పందించారు. ఆర్థికంగా పైకి వచ్చినవాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. అట్టడుగున ఉన్నవారికి చేయూత ఇవ్వాలి. సమాజాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తాను. నేనెప్పుడూ భవిష్యత్తు కోసం రాబోయే 20-30 సంవత్సరాలకు ముందే ఆలోచిస్తా అని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశంలో రెండో తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతుంటుందని వివరించారు. జనాభా వృద్ధి చెందడం అత్యంత ముఖ్యమైన అంశం అని స్పష్టం చేశారు. మట్టిలో మాణిక్యాల్లాంటివారు మన పిల్లలు. బాగా చదివిస్తే ప్రపంచాన్ని ఏలుతారు. ఇప్పుడు ఏపీలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సంపదను సృష్టించి అందరికీ పంచుతాం అన్నారు. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సి అవసరం చాలా ఉందని అన్నారు. లేకపోతే, రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఇదే సమస్యగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.