Amaravati : కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల చేసింది. అమరావతిలో పనులు ప్రారంభమవుతున్నందున 25 శాతం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని సీఆర్డీయే కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది. కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 విడుదల చేసింది. అయితే అమరావతి తొలి దశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించగా.. మరో రూ.1,400 కోట్లను తమ నిధుల నుంచి కేంద్రం కేటాయిస్తోంది.
Read Also: Peddi : ‘పెద్ది’ టీజర్ పై అల్లు శిరీష్ ట్వీట్..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
అమరావతి రాజధాని నగరంలో ఫేజ్1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి 1600 మిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లు) నిధులిచ్చేందుకు గతంలోనే అంగీకరించాయి. ఇందులో ఒక్కో బ్యాంక్ 800 మిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చడానికి అంగీకరించాయి. ప్రపంచ బ్యాంకు అందించిన వివరాల ప్రకారం అమరావతి రాజధాని ప్రాజెక్ట్ ఈ ఏడాది జనవరి 22న అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతగా 205 మిలియన్ డాలర్ల నిధుల్ని గత నెలలో విడుదల చేశారు. దీంతో కేంద్రం కూడా ఇందులో నుంచి అమరావతి రాజధానికి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో అమరావతిలో నిర్మాణాల పునఃప్రారంభానికి ఊతం లభించబోతోంది.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నిధుల కోసం సీఎం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. ఇక ఈ విషయంపై కూటమి పార్టీల ఎంపీలు మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి వల్లే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని చెప్పారు. తాజాగా విడుదల చేసిన నిధులతో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు సైతం చేయూతనిచ్చింది. వేల కోట్ల నిధులను కేంద్రం ఇప్పటికే అందించింది.