Koushalam Portal : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోంది. ‘కౌశలం’ పోర్టల్ ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే 24.14 లక్షల మంది యువత వివరాలు సేకరించి, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు అందించింది. మరిన్ని ఉపాధి అవకాశాల కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించనుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కల్పనకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది.
- ఏపీలో కౌశలం ద్వారా ఐటీ ఉద్యోగాలు
- పోర్టల్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
- ఇప్పటికే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పనిలో ఉంది. ఈ మేరకు ఐటీ కంపెనీలు, పరిశ్రమలను తీసుకుురావడంతో పాటుగా.. ఆయా సంస్థలకు అవసరమైన నైపుణ్యం ఉండేలా శిక్షణ ఇస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కౌశలం పేరుతో సర్వే నిర్వహించి నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించింది.. ప్రస్తుతం వారందరికి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, జీసీసీ అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను గుర్తించే పనిలో ఉంది.
నిరుద్యోగ యువతకు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ‘కౌశలం’ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ‘ఏఐ ఆధారంగా పనిచేసే పోర్టల్ ద్వారా ప్రైవేటు కంపెనీలకు అవసరమైన నైపుణ్య సిబ్బందిని గుర్తించే చర్యలు చేపట్టాం. డేటా ఆధారంగా అర్హత కలిగిన యువతను గుర్తించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని తెలిపారు. ఈ పోర్టల్‌లో ఇప్పటికే చదువుకుని ఉద్యోగం లేనివారు, తమ అర్హతకు తగిన ఉద్యోగం దొరకని వారి వివరాలను నమోదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 24.14 లక్షల మంది యువత నుంచి సమాచారం సేకరించారు.. పోర్టర్‌లో పొందుపరిచారు. యువతలో డేటా, కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిని పరిశీలించి, అర్హతలను బట్టి దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించడం విశేషం. యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే దిశగా.. రాబోయే రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబయి వంటి నగరాల్లోని కంపెనీలతో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ ‘కౌశలం’ పోర్టల్‌ను రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. యువత విద్యార్హతలు, ఇతర వివరాలను కంపెనీలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.. ఈ ప్రాజెక్టును రాబోయే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి తీసుకురానున్నారు. కౌశలం ద్వారా యువతకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను కూడా కల్పించనుంది ప్రభుత్వం.. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పరీక్షల్ని కూడా నిర్వహిస్తున్నారు.
