Terrorist Attack : జమ్ము కాశ్మీర్‌లోని పహల్గంలో జరిగిన టెర్రరిస్టు దాడి పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారు చంద్రమౌళి, మధుసూదన్‌కు సీఎం సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు జరిగిన నష్టాన్ని భరించే శక్తి పొందాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని ఆ కుటుంబాలకు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని సీఎం అన్నారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం మద్దతు ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Terrorists Sketch : పహల్గాం కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
మరోవైపు ఈ ఉగ్రదాడిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. వారికి గౌరవ సూచకంగా, సంఘీభావంగా పార్టీ తరఫున తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. జనసేన జెండా సగం ఎత్తులో ఎగురుతుందని తెలిపారు. సమష్టిగా, మనం దీనిని అధిగమిద్దామని.. కలిసి, మనం కోలుకుందామని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. దారుణమైన పహల్గం దాడి తీవ్రంగా కలచివేసిందన్నారు. భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక, ఏప్రిల్ 25 సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలు, మానవహారాలు ఏర్పాటు చేయాలని జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కాల్పుల్లో మరణించిన పర్యాటకులను స్మరించుకునేందుకు మూడు రోజుల పాటు JSP కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
Read Also: JD Vance : తాజ్ మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం