Srivani Trust : టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో సోమవారం నాడు పాలకమండలి తొలి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుందన్నారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం అన్నారు.
తిరుమలలో నేతలు రాజకీయ విషయాలు మాట్లాడటంపై నిషేధం విధించారు. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేస్తూ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నాం. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఇకపోతే.. పలుమార్లు నిత్య అన్నదానంపై ఆరోపణలు, వదంతులు వ్యాపిస్తున్న తరుణంలో నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని, మెనూలో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని, పాలకమండలి సమావేశంలో నిర్ణయించామన్నారు. శాశ్వత ఉద్యోగులకు రూ.15400, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.7530 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం అందిస్తామన్నారు. శారదా పీఠంకి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దుచేసి తాము స్వాధీనం చేసుకోవడం జరిగిందని, టూరిజం టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేసినట్లు, ఈ టికెట్ల వ్యవహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు తమకు సమాచారం అందిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
Read Also: Assembly meetings : ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల