Site icon HashtagU Telugu

Babu Delhi Tour: ఢిల్లీకి చంద్రబాబు, మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ?

CBN Vision 2024

Chandrababu

వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు మరింత సమయం ఉన్నప్పటికీ ఆయన తన వ్యూహాలకు ఇప్పట్నుంచే పదును పెడుతున్నారు. ఇప్పటికే మహానాడు, యువగళం పేరుతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లడం, పార్టీకి ఊహించనివిధంగా రెస్పాన్స్ రావడం, బాబు సభలు ఊహించనవిధంగా సక్సెస్ కావడంతో అన్ని పార్టీలు టీడీపీ పార్టీని నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనుండగా.. ఇవాళ లేదా రేపు ప్రధాని మోదీని కలిసే అవకాశముందని సమాచారం. అలాగే పలువురు కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్‌సై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవల బీజేపీకి చంద్రబాబు దగ్గరవుతున్నారు. దేశ అభివృద్ధి కోసం అవసరమైతే మోదీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తున్నారు. పలు బిల్లుల విషయంలో పార్లమెంట్‌లో బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. గత ఎన్నికల తర్వాత బీజేపీని చంద్రబాబు విమర్శించడం మానేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీ అండ అవసరమని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల తెలంగాణలో టీటీడీపీ మంచి ఆదరణ వస్తుండటం, గతంలో నిర్వహించిన ఖమ్మం సభ ఢిల్లీ పెద్దలను ఆకర్షించిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూరుకు ప్రాధాన్యం సంతరించుకుంది.

చాలా ఏళ్ల తర్వాత అమిత్ షాతో సమావేశం కానుండటం ఏపీ పాలిటిక్స్‌లో కీలకంగా మారింది. అజాదీ కా అమత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్బంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలందరినీ కేంద్రం ఆహ్వానించింది. ఈ సమయంలో చాలాకాలం తర్వాత మోదీ, చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు జీ20 సన్నాహక సదస్సులో భాగంగా మరోసారి మోదీతో బాబు భేటీ కానున్నారని తెలుస్తోంది. జీ 20 సమావేశంపై దేశంలోని అన్ని పార్టీల నుంచి కేంద్ర ప్రభుత్వం సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. అందులో భాగంగా మోదీతో బాబు సమావేశం కానున్నారు. ఒకవేళ చంద్రబాబు మోడీ, అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ అయితే కచ్చితంగా ఏపీ రాజకీయాలు మలుపు తిరుగుతాయి.

Also Read: Coffee and Tea: పొద్దునే కాఫీ, టీ తాగుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి