Jr.NTR Vs TDP : జూనియ‌ర్ పై టీడీపీ డైరెక్ట్ అటాక్!

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీ ప్ర‌త్య‌క్ష దాడికి దిగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా మాత్ర‌మే టార్గెట్ చేసింది.

  • Written By:
  • Updated On - November 25, 2021 / 10:40 PM IST

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీ ప్ర‌త్య‌క్ష దాడికి దిగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా మాత్ర‌మే టార్గెట్ చేసింది. ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా లీడ‌ర్లు రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి శీలంపై వైసీపీ నేత‌లు చేసిన కామెంట్లు ఎన్టీఆర్ మెడ‌కు చుట్ట‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం అయింది. ఆ క్ర‌మంలోనే పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య‌ను రంగంలోకి దింపిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. మీడియా ముఖంగా ఆయ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్ తీరుపై విరుచుకుప‌డ్డాడు. మేన‌త్త శీలంపై జ‌రిగిన రాద్దాంతంపై 70 ఏళ్ల ముస‌లాడి మాదిరిగా ఎన్టీఆర్‌ సుభాషితాలు చెప్పాడ‌ని మండిప‌డ్డాడు. అంతేకాదు, హ‌రికృష్ణ బ‌తికి ఉంటే ఇలా ఉండేది కాద‌ని ప‌రోక్షంగా ఆ కుటుంబానికి వేరుగా జూనియ‌ర్ ను చూపించే ప్ర‌య‌త్నం చేశాడు.

భువ‌నేశ్వ‌రి శీలంపై అసెంబ్లీలో జ‌రిగిన అవ‌మానం భ‌రించ‌లేక చంద్ర‌బాబునాయుడు భోరున విల‌పించిన సంఘ‌ట‌న‌పై ఆల‌స్యంగా వ‌ర్ల రామ‌య్య స్పందించాడు. ఆయ‌న ఇంటిలోనే గురువారం ఒక రోజు దీక్ష‌కు దిగాడు.  ఆయ‌న‌కు టీడీపీ శ్రేణులు మ‌ద్ధ‌తు ప‌లికాయి. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకున్నాడు.బాల‌క్రిష్ణ మాదిరిగా కుటుంబ స‌భ్య‌లు అంద‌రూ మీడియా ముందుకు రాకుండా ఎందుకు ఎన్టీఆర్ అట్టీముట్ట‌న‌ట్టు ఉన్నాడ‌ని దుయ్య‌బ‌ట్టాడు. పైగా మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబ‌ల్ వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇద్ద‌రూ ఆయ‌న మ‌నుషులేన‌ని తేల్చేశాడు. జూనియ‌ర్ వార్నింగ్ ఇస్తే, వాళ్ల నోరు అదుపులో పెట్టుకునే వాళ్ల‌ని ప‌రోక్షంగా ఇదంతా ఎన్టీఆర్ చేత‌గానిత‌నంగా చిత్రీక‌రించాడు వ‌ర్ల రామ‌య్య‌.సాధార‌ణంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో స్థాయి లీడ‌ర్ మాట్లాడుతున్నాడంటే, పార్టీ విధానంగా ప‌రిగ‌ణిస్తారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ మీద ఇప్పుడు వ‌ర్ల రామ‌య్య చేసిన కామెంట్లు పార్టీ ఆదేశంగా క్యాడ‌ర్ భావిస్తోంది. ఈ ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే, ఎన్టీఆర్ నీడ‌ను పూర్తిగా తొలిగించుకోవ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అర్థం అవుతోంది. త‌ర‌చూ ఎన్టీఆర్ రూపంలో చంద్ర‌బాబుకు ఏదో ఒక రూపంలో అడ్డంకి క‌నిపిస్తోంది. పైగా ఎక్క‌డ‌కు వెళ్లినా..జూనియ‌ర్ ఎన్టీఆర్ కు మ‌ద్ధ‌తుగా నినాదాలు వినిపిస్తున్నాయి.

Also Read : జూనియ‌ర్ పై టీడీపీ క్యాడ‌ర్ గుస్సా

చంద్ర‌బాబు కుప్పం వెళ్లిన ప్ర‌తిసారి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను తీసుకురావాల‌ని డిమాండ్ వ‌స్తోంది. ఆ మ‌ధ్య జూనియ‌ర్ ఫ్ల‌క్సీల‌ను ప్ర‌ద‌ర్శించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నికల ప్ర‌చారానికి బాబు వెళ్లిన‌ప్పుడు జూనియ‌ర్ నినాదాలు పెద్ద పెట్టున వినిపించాయి. ఆ వేదిక‌పై అనివార్యంగా ఎన్టీఆర్ కు అనుకూలంగా చంద్ర‌బాబు స్పందించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇటీవ‌ల కుప్పంలో ఘోర ఓట‌మికి కార‌ణంగా జూనియ‌ర్ అభిమానులుగా పార్టీ భావిస్తోంది.
తాజా సంక్షోభం నుంచి పార్టీని బ‌య‌ట వేయాలంటే..జూనియ‌ర్ ఒక్క‌డే అనే అభిప్రాయం చాలా మంది టీడీపీ క్యాడ‌ర్ లో ఉంది. ఇలాంటి చికాకుల‌కు శాశ్విత ప‌రిష్కారం కోసం జూనియ‌ర్ ను వ‌దిలించుకోవాల‌ని టీడీపీ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే వ‌ర్ల రామ‌య్య‌తో తొలుత జూనియ‌ర్ పై అటాక్ ను ప్రారంభించార‌ని ఆ పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల చ‌ర్చ‌.నంద‌మూరి కుటుంబం, టీడీపీని వేరుగా చూడ‌లేం. చంద్ర‌బాబునాయుడు అధ్యక్షుడిగా పార్టీ మూడు ద‌శాబ్దాల‌కు పైగా న‌డుస్తోంది. గెలుపు ఓట‌ముల‌తో సంబంధంలేకుండా క్యాడ‌ర్ ను నారా కుటుంబం నిల‌బెడుతోంది. నంద‌మూరి కుటుంబంలోని కీల‌క హీరో బాలక్రిష్ణ వియ్యంకుడు అయిన త‌రువాత ఇక తెలుగుదేశం పార్టీ నారా కుటుంబం నుంచివెనుక్కు రావ‌డం క‌ష్ట‌మ‌ని చాలా మంది భావిస్తున్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయ వార‌సునిగా లోకేష్ పార్టీలో ఎదుగుతున్నాడు. కాబోయే సీఎం లోకేష్ అనే నినాదం కూడా పార్టీలో వినిపిస్తోంది. ఆ క్ర‌మంలో జూనియ‌ర్ ను రాజ‌కీయంగా అడ్డులేకుండా చేసుకోవ‌డ‌మే మంచిద‌ని టీడీపీలోని ఒక వ‌ర్గం భావిస్తోంది. అందుకే, వ‌ర్ల రామ‌య్య పొలిట్ బ్యూరో హోదాలో జూనియర్ ను టార్గెట్ చేశాడ‌ని తెలుస్తోంది. ఇక రాబోవు రోజుల్లో అందరూ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా గ‌ళం వినించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇలాంటి ప‌రిణామం పార్టీని ఎటువైపు మ‌ళ్లిస్తోంది చూద్దాం.!